Telangana Power Demand : రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ వినియోగం ఒక వైపు, పట్టణాల్లో కూలర్లు, ఇతర విద్యుత్ అవసరాలు మరో వైపు కలిసిపోవడంతో జనవరి నెలలోనే విద్యుత్ డిమాండ్ అత్యధిక స్థాయికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ దాదాపు 14,850 మెగావాట్లు దాటగా, దక్షిణ డిస్కం పరిధిలో 9,500 మెగావాట్లకు చేరినట్లు తెలుస్తోంది. ఆదివారం కూడా 14,785 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. ఈ యాసంగి సీజన్‌లో వ్యవసాయ అవసరాల పెరుగుదల, పట్టణాల్లో పెరిగిన వినియోగంతో విద్యుత్ వాడకం విపరీతంగా పెరుగుతోందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
వేసవికి ముందే ప్రణాళికలు సిద్ధం
ప్రతి రోజు 250 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం నమోదవుతోంది. రానున్న వేసవి కాలంలో మరింతగా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL) వేసవి కాలానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. వివిధ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను నియమిస్తూ TSSPDCL ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యేక నోడల్ అధికారులు నియామకం
వివిధ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించారు.
- నాగర్ కర్నూల్ జిల్లా – డైరెక్టర్ ఆపరేషన్స్ డా. ఎస్. నరసింహులు
- సంగారెడ్డి జిల్లా – డైరెక్టర్ ప్రాజెక్ట్స్ నంద కుమార్
- సిద్దిపేట జిల్లా – డైరెక్టర్ కమర్షియల్ కే. సాయి బాబు
- నల్గొండ జిల్లా – చీఫ్ ఇంజనీర్ పీ. బిక్షపతి
- వికారాబాద్ జిల్లా – పీ. ఆనంద్
- జోగులాంబ గద్వాల జిల్లా – కే. భాస్కర్
- వనపర్తి జిల్లా – రంగనాథ్ రాయ్
- నారాయణపేట జిల్లా – ప్రభాకర్
- హైదరాబాద్ జిల్లా – చక్రపాణి
- మహబూబ్ నగర్ జిల్లా – నరసింహ స్వామి
- రంగారెడ్డి జిల్లా – పాండ్య
- మెదక్ జిల్లా – బాల స్వామి
- మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా – కామేష్
- యాదాద్రి భువనగిరి జిల్లా – ప్రతిమా షోమ్
- సూర్యాపేట జిల్లా – బి. రవి
గ్రామీణ ప్రాంతాలకు టోల్ ఫ్రీ సేవలు విస్తరణ
వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ నగరానికే పరిమితమైన టోల్ ఫ్రీ నెంబర్ 1912ను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడో, అత్యవసర విద్యుత్ సమస్య ఎదురైనప్పుడో 1912 నంబర్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
వేసవి కాలంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా, వినియోగం పెరిగినప్పటికీ నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారుల స్పష్టం.
Non Veg : హైదరాబాద్‌లో రేపు నాన్ వెజ్ షాపులు బంద్.. ఎందుకంటే..!