NTV Telugu Site icon

Revanth Reddy: సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం వాటిపైనే..

Revanth Reddy Sign

Revanth Reddy Sign

తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. అదే విధంగా రాజకీయంగా తొలి నియామకం కూడా దాదాపు ఫిక్స్ అయింది. మంత్రివర్గం పైనా కసరత్తు చేసిన రేవంత్ హైకమాండ్ ఆమోదం తీసుకుంటున్నారు. ఇదే టైంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను సైతం భర్తీ చేసేందుకు రెడీ అయ్యారు. పార్టీ అగ్రనేతలు, అతిధులు, కొత్త మంత్రులు, పార్టీ శ్రేణుల సమక్షంలోనే ఆరు గ్యారంటీ పథకాల అమలుపై సంతకం చేయబోతున్నాడు.

Read Also: Mizoram : మాకు లింగభేదం లేదు.. ఏదైనా చేసేందుకు సిద్ధం : మిజోరం ఎమ్మెల్యే

ఇక, 2004లో వైఎస్సార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పైన ప్రమాణ స్వీకారం చేసిన ఇదే వేదిక పై.. ఇప్పుడు రేవంత్ అదే తరహాలో సంతకం చేసేందుకు రెడీ అయ్యాడు. ఆ తర్వాత 9న మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాల అమలు తీరును ఖరారు చేయనున్నారు. తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు రేవంత్ కు సవాల్ గా మారనున్నాయి. ఈ గ్యారంటీల అమలుకు ఏడాదికి లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో, ఇప్పుడు నిధుల సమీకరణ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ గా మారింది. ఇక, పాలనా పరంగానూ అనేక సవాళ్లు ఆయన ముందు ఉన్నాయి. ఇదే టైంలో సీఎం అయిన తరువాత రేవంత్ రాజకీయ నియామకాలపైన నజర్ పెట్టనున్నారు. బాధ్యతలు చేపట్టగానే పంపకానికి నాలుగు ఎమ్మెల్సీ పదవులు రెడీగా ఉన్నాయి. అందులో రెండు గవర్నర్‌ కోటా కాగా.. మరో రెండు ఎమ్మెల్యే కోటాలో ఉన్నాయి.

Read Also: Cyclone Michaung: మిచాంగ్‌ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు! మరో 24 గంటలు

అయితే, కేసీఆర్ సర్కార్ గవర్నర్‌ కోటా కింద బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, కె.సత్యనారాయణ పేర్లను పంపించింది.. కానీ, గవర్నర్‌ తమిళిసై అభ్యంతరాలతో ఆ పదవుల భర్తీ నిలిచిపోయింది. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ఈ రెండు సీట్లనూ కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఈ నాలుగు ఎమ్మెల్సీ పదవులను కొత్త ప్రభుత్వం ఎవరికి ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ నుంచి ఈసారి ముస్లింలలో ఒక్కరు కూడా గెలవకపోవడంతో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీని ఎమ్మెల్సీగా చేసే ఛాన్స్ ఉంది. అలాగే అద్దంకి దయాకర్‌ సైతం ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. వీరితో పాటు హర్కార వేణుగోపాల్‌ పేరూ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. సీపీఐకి రెండు ఎమ్మెల్సీ పోస్టులు ఇస్తామనీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీంతో.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తీసుకొనే నిర్ణయాలపైన ఆసక్తి నెలకొంది.