TSRTC: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి.. ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. అంతే కాకుండా ఈ పండుగ సీజన్ లో రికార్డు స్థాయిలో ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. జనవరి 11 నుంచి 14 వరకు 1.22 కోట్ల మంది ప్రయాణికులు తమ సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 5 లక్షల మంది ఎక్కువగా ప్రయాణించారని ప్రకటించారు. సంక్రాంతి తిరుగుప్రయాణానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, ఇతర అంశాలపై అధికారులతో హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఆన్‌లైన్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. సంక్రాంతికి సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చిన సిబ్బందిని సజ్జనార్ అభినందించారు.
Read Also: State Planning Commission: పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే.. పంచాయతీరాజ్ గ్రూప్
తిరుగు ప్రయాణంలోనూ అదే రకంగా పనిచేసి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11 నుంచి 14 వరకు 3203 ప్రత్యేక బస్సులను నడిపినట్లు తెలిపారు. ఆయా రోజుల్లో 2384 బస్సులను నడపాలని నిర్ణయించగా.. రద్దీ దృష్ట్యా అదనంగా మరో 819 బస్సులను నడిపినట్లు ఆయన వివరించారు. నాలుగు రోజుల్లో 1.57 కోట్ల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయని తెలిపారు. ఈసారి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయలేదని తెలిపారు సజ్జనార్. భవిష్యత్తులోనూ సంస్థను ఇలాగే ఇలాగే ప్రోత్సహించాలని కోరారు. ఇందులో భాగంగా ఏపీ నుంచి 212 ప్రత్యేక బస్సులు ఉన్నాయని చెప్పారు. మరో వైపు సంక్రాంతికి వెళ్లి తిరిగి వచ్చే వారి కోసం 3 వేల ప్రత్యే బస్సులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.