Site icon NTV Telugu

Reality Problems: ‘రియల్‌’గా చెప్పాలంటే.. ఇళ్లు కట్టలేం.. కొనలేం..!!

Real Estate

Real Estate

రియల్‌ ఎస్టేట్‌ రంగంపై రెపో రేట్‌ దెబ్బ బాగానే పడింది. ఈ ప్రభావం ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో బిల్డర్లు, బయ్యర్లు ఇద్దరూ భయపడుతున్నారు. ఇళ్లు కట్టాలన్నా, కొనాలన్నా ఇబ్బందిపడుతున్నారు. ఇళ్లు కడితే జనం కొంటారో లేదోనని నిర్మాణదారులు, కొంటే ఈఎంఐలు కట్టగలమో లేదో అని కొనుగోలుదారులు దీర్ఘాలోచనలో పడిపోతున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వరుసగా రెండు సార్లు వడ్డీ (రెపో) రేట్లు పెంచటంతో అన్ని బ్యాంకులూ అదే బాటపట్టాయి. ముఖ్యంగా హౌజింగ్‌ లోన్లు భారంగా మారాయి. ఫలితంగా ప్రజల్లో ఇళ్లు కొనే ఆర్థిక సామర్థ్యం తగ్గిపోయింది.

అఫర్డబిలిటీ ఇండెక్స్‌(affordability index)పై వెలువడ్డ ఓ అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. మొన్నటితో ముగిసిన మొదటి రెండు త్రైమాసికాల్లో దాదాపు అన్ని మార్కెట్లదీ ఇదే పరిస్థితి అని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన నైట్‌ ఫ్రాంక్స్‌ సంస్థ పేర్కొంది. దాదాపు దశాబ్దం తర్వాత 2019లో రియల్‌ ఎస్టేట్‌ రంగం కాస్త కుదుట పడింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గటం, బయ్యర్ల కొనుగోలు స్తోమత పెరగటంతో ఇళ్ల క్రయవిక్రయాలు స్థిరంగా కొనసాగాయి. 2020 తొలి త్రైమాసిక చివరి నాటికి కరోనా ప్రారంభమైనా ఆ ఎఫెక్ట్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంపై పెద్దగా పడలేదు. 2021లో కూడా స్థిరాస్తి వ్యాపారం పర్లేదనిపించింది.

కానీ.. ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేటును స్థూలంగా 90 బేస్‌ పాయింట్లు పెంచిందో ఇక అప్పటి నుంచి ఇళ్ల కొనుగోళ్లు సగటున 2 శాతం మందగించాయి. ఈఎంఐల భారం సుమారు 7 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రాపర్టీ రేట్లు పెరుగుతున్న సమయంలోనే బ్యాంకుల వడ్డీ రేట్లు కూడా పెరగటం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి తీవ్ర ప్రతికూలంగా మారింది. 2020-21 మధ్య కాలంలో కొవిడ్‌ వల్ల జరిగిన నష్టాన్ని కొద్దోగొప్పో పూడ్చుకోవాలనుకున్న బిల్డర్ల, డెవలపర్ల అంచనాలు తప్పాయి. దేశంలోని అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్‌ మార్కెట్‌గా పేరొందిన హైదరాబాద్‌లోనూ స్థిరాస్తి వ్యాపారం రెపో రేటు పెరగటం వల్ల దెబ్బతిన్నట్లు నైట్‌ ఫ్రాంక్స్‌ ప్రొప్రైటరీ అఫర్డబిలిటీ ఇండెక్స్‌ స్టడీలో వెల్లడైంది.

గడచిన కొన్ని నెలల్లో ప్రజల్లో ఇళ్ల కొనుగోలు సామర్థ్యం దేశంలోని 8 మేజర్‌ మార్కెట్లలో 200-300 బేస్‌ పాయింట్లు తగ్గిందని నైట్‌ ఫ్రాంక్స్‌ సీఎండీ శిశిర్‌ బాయ్‌జల్‌ తెలిపారు. అయితే ఆర్థికంగా కొంచెం భారమైనప్పటికీ సొంతిల్లు కొనుక్కోవాలనుకునేవాళ్ల సంఖ్య మళ్లీ పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, స్థిరత్వం, ప్రజల ఉద్యోగ భద్రత తదితర అంశాలు రియల్‌ ఎస్టేట్‌ సెక్టార్‌ని తిరిగి నిలబెడతాయని చెప్పారు. రెపో రేట్‌ అంటే ఆర్బీఐ దేశంలోని వివిధ బ్యాంకులకు ఇచ్చే లోన్లపై వసూలు చేసే వడ్డీ రేటు అని అర్థం. రెపో రేట్‌ పెరగటం వల్ల బ్యాంకులు కూడా ఖాతాదార్లకు, ఇతరులకు ఇచ్చే పలు రకాల రుణాలపై వడ్డీని పెంచుతాయి. దీంతో ప్రజలు లోన్లు తీసుకునేందుకు వెనకాడతారు. ఫలితంగా వాళ్లలో కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతుంది.

IND Vs ENG: ధోనీ, సచిన్ రికార్డులను బ్రేక్ చేసిన పంత్

Exit mobile version