NTV Telugu Site icon

Blast at Pharma Company: అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే..!

Blast

Blast

Blast at Pharma Company: అనకాపల్లిజిల్లా అచ్యుతాపురంలోని సాహితి ఫార్మాలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం.. తీవ్ర విషాదాన్ని నింపింది. బాధితుల కళ్లలో కన్నీళ్లను మిగిల్చింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే ఫ్యాక్టరీ మొత్తం చుట్టేశాయి. పొగలు పరిసర ప్రాంతాల్లో దట్టంగా అలుముకున్నాయి. ఘాటు వాయువులు గాల్లోకి చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నిన్న ఉదయం 11.10 నిముషాలకు సాహితీ ఫార్మా యూనిట్-1లో కంటైనర్ నుంచి సాల్వెంట్స్‌ డంప్‌ చేస్తుండగా ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. యార్డులోని రసాయనాలకు అంటుకున్న నిప్పు రియక్టర్ల వరకు వ్యాపించింది. దీంతో భారీ శబ్దంతో పేలడంతో.. మంటలు మరింత ఉధృతంగా ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో 35మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా.. ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రకటించారు వైద్యులు.

Read Also: Astrology : జులై 01, శనివారం దినఫలాలు

ప్రమాదం జరిగిన వెంటనే ఘటాన స్థలానికి చేరుకున్న 11 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రావడంతో ఫోమ్ ఫైర్ ఫైటర్లను రప్పించారు. వారి రంగ ప్రవేశం తరువాత మంటలు తగ్గుముఖం పట్టాయి. NDRF, SDRF బృందాలు ఐదు గంటల పాటు శ్రమించి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు ఫైర్ సిబ్బంది కూడా గాయపడ్డారు. ఇటీవల జరిగిన అతిపెద్ద ఇండస్ట్రియల్‌ ప్రమాదం ఇదే. భారీ ఆస్తి నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతులకు 25 లక్షలు, గాయపడ్డ వారికి ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది ప్రభుత్వం. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.