RCB Victory Celebrations: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 టైటిల్‌ను వరుసగా రెండోసారి కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు కీలక సందేశాన్ని అందించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ, మరోసారి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే విజయోత్సాహంలో అభిమానులు బాధ్యతగా వ్యవహరించాలని ఫ్రాంచైజీ ప్రత్యేకంగా కోరింది.
ఈ సీజన్ మొత్తం ఆర్సీబీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన బెంగళూరు జట్టు, క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌పై 254/5 భారీ స్కోరు నమోదు చేసి ఘన విజయం సాధించింది. అదే జోరును ఫైనల్లో కూడా కొనసాగించి మరోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బౌలర్లు ఫైనల్లో అసాధారణ ప్రదర్శన కనబరిచి జట్టు విజయానికి బాటలు వేశారు. టైటిల్ విజయం అనంతరం ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. భావోద్వేగ క్షణాలు, ఆనందభాష్పాలు, సంబరాలతో ఆర్సీబీ శిబిరం మార్మోగిపోయింది. ట్రోఫీతో కలిసి ఆటగాళ్లు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే విజయానంతరం సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆర్సీబీ ఫ్రాంచైజీ అభిమానులకు ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. “ఈ విజయం మొత్తం ఆర్సీబీ అభిమానులదే. సంబరాలు ప్రారంభమవుతున్న ఈ సమయంలో బాధ్యతగా వ్యవహరించండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఇంట్లోనే ఈ విజయాన్ని ఆస్వాదించండి. ఈ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందించండి. వచ్చే ఏడాది స్టేడియంలో మళ్లీ కలుద్దాం” అని పేర్కొంది. ఈ సందేశం వెనుక గత ఏడాది జరిగిన విషాద ఘటన ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తొలి టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల నిర్వహించిన విజయోత్సవాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దీంతో ఈసారి ఫ్రాంచైజీ ఎలాంటి విజయోత్సవ ర్యాలీ నిర్వహించే ఆలోచనలో లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఆర్సీబీ విజయం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంబరాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కర్ణాటకకు పొరుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో వందలాది మంది అభిమానులు జెండాలు, బ్యానర్లతో రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే కొన్ని చోట్ల పరిస్థితి అదుపు తప్పింది. ముఖ్యంగా రాజు విహార్ సెంటర్ సమీపంలో అభిమానుల గుంపు రహదారులను దిగ్బంధించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతటితో ఆగకుండా కొందరు ఆవేశపూరిత అభిమానులు రోడ్డుపక్కన నిలిపి ఉంచిన ఓ ప్రైవేట్ బస్సును అడ్డగించి దానిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో బస్సు అద్దాలు ధ్వంసమవగా, అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనితో బస్సుకు నష్టం వాటిల్లింది.
ఈ నేపథ్యంలో క్రీడా విజయాలు ఆనందాన్ని పంచేవే అయినప్పటికీ, సంబరాలు ఇతరులకు ఇబ్బందులు కలిగించేలా లేదా హింసాత్మకంగా మారకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ కూడా ఇదే సందేశాన్ని అభిమానులకు అందిస్తూ, విజయాన్ని ఆనందంగా జరుపుకోవాలని.. కానీ, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని కోరింది. మొత్తంగా చూస్తే ఆర్సీబి ఎటువంటి విజయోత్సవ ర్యాలీ నిరవహించడం లేదు.
What a night. What a feeling. 🥹
To every member of the RCB nation, congratulations. This is YOUR win. 🏆❤️
As the celebrations begin, let’s be responsible. 🙌
Best way to celebrate is with your loved ones. Relive the memories, and enjoy this special moment from the comfort of… pic.twitter.com/hdGO3n115a
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 31, 2026
