Site icon NTV Telugu

 RCB: “ఈ సలా కప్‌ నమ్‌దు”.. 2025 ఏడాదికి భావోద్వేగంతో వీడ్కోలు పలికిన ఆర్సీబీ ఫ్యాన్స్..

Rcb Sale

Rcb Sale

RCB: 2025 ఏడాది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకే కాదు.. ఆ జట్టును ప్రాణంగా ప్రేమించే అభిమానులకు కూడా జీవితాంతం గుర్తుండిపోయే సంవత్సరంగా నిలిచింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, ఎన్నో నిరాశలు, లెక్కలేనన్ని ఆశలు.. అన్నింటికీ ఈ ఏడాది ఒక తీపి ముగింపు పలికింది. “ఈ సాల కప్ నమ్‌దే” అనే నినాదం చివరకు నిజమైంది. ఐపీఎల్‌ ప్రారంభమయ్యే ప్రతిసారీ ఈ మాటతో ఊగిపోయే ఆర్సీబీ అభిమానులు, సీజన్‌ ముగిసే సరికి మౌనంగా నిలిచిపోయే సందర్భాలు ఎన్నో చూశారు. కానీ 2025లో మాత్రం అదే నినాదం ట్రోఫీ రూపంలో కళ్లముందు నిలిచింది.

READ MORE: Dhurandhar : ‘ధురంధర్’కు సెన్సార్ షాక్.. ఆ పదం తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు!

చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ వంటి జట్లు అయిదేసి సార్లు కప్పులు గెలుస్తుంటే, ఆకర్షణలో ఏమాత్రం తగ్గని ఆర్సీబీ మాత్రం ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయిన చరిత్ర అభిమానులను ఎప్పుడూ బాధించేది. గుజరాత్‌ టైటాన్స్‌ లాంటి కొత్త జట్టు తొలి సీజన్‌లోనే కప్ కొట్టినా, బెంగళూరు మాత్రం మూడుసార్లు ఫైనల్‌కు చేరి కూడా విజేతగా నిలవలేకపోయింది. విరాట్‌ కోహ్లి వంటి దిగ్గజం ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎంత శ్రమించినా ఫలితం రాకపోవడం ఆ జట్టుకు పెద్ద గాయం. 2025 సీజన్‌కు ముందు మెగా వేలం తర్వాత జట్టును చూసి, రజత్‌ పాటీదార్‌ను కెప్టెన్‌గా ప్రకటించగానే అభిమానుల్లో అనుమానాలు పెరిగాయి. ఈసారి కూడా అదే కథ పునరావృతమవుతుందేమోనన్న భయం కనిపించింది. కానీ 2025 ఏడాదిలో ఈసారి ఒక్క స్టార్‌పైనే ఆధారపడే జట్టు కాదు. కోహ్లి తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసినా, బ్యాటింగ్‌ మొత్తం అతనిపైనే ఆధారపడలేదు. సాల్ట్‌ వేగవంతమైన ఆరంభాలు ఇచ్చాడు. పడిక్కల్‌, పాటీదార్‌ ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించారు. జితేశ్‌ శర్మ, టిమ్‌ డేవిడ్‌, షెఫర్డ్‌ చివరి ఓవర్లలో మ్యాచ్‌ను తిప్పేసే పాత్రలు పోషించారు. గతంలో టాప్‌ ఆర్డర్‌ విఫలమైతే జట్టు కుప్పకూలేది. కానీ ఈసారి అలాంటి బలహీనత కనిపించలేదు. బ్యాటింగ్‌లో సమష్టితత్వం స్పష్టంగా కనిపించింది.

READ MORE: Switzerland: న్యూఇయర్ వేళ ఘోర విషాదం.. ఓ బార్‌లో భారీ పేలుడు.. పలువురు మృతి

ఇదే సమయంలో బౌలింగ్‌ విభాగం ఆర్సీబీకి అసలైన ఆయుధంగా మారింది. ఎంత స్కోరు చేసినా కాపాడుకోలేని పరిస్థితి గతంలో ఉండేది. కానీ 2025లో ఆ లోపం పూర్తిగా పోయింది. హేజిల్‌వుడ్‌ ముందుండి బౌలింగ్‌ దళాన్ని నడిపించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ, ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లను కూడా గెలుపుగా మలిచాడు. భువనేశ్వర్‌, యశ్‌ దయాళ్‌ అతనికి చక్కటి సహకారం అందించారు. స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్య ఫైనల్‌ సహా పలు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు. రజత్‌ పాటీదార్‌ కెప్టెన్సీ కూడా జట్టుకు పెద్ద బలంగా మారింది. ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఆటగాళ్లను సమర్థంగా ఉపయోగించాడు. ఈ విజయం విరాట్‌ కోహ్లి కెరీర్‌కు కూడా ఒక పరిపూర్ణతను ఇచ్చింది. వన్డే ప్రపంచకప్‌, టీ20 ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీలు, ఎన్నో ద్వైపాక్షిక సిరీస్‌ విజయాలు.. అన్నీ సాధించినా ఐపీఎల్‌ ట్రోఫీ మాత్రం అతని చేతికి అందని కలగానే ఉండిపోయింది. ప్రతి సీజన్‌లో పరుగులు చేసినా, జట్టు విజయం సాధించలేకపోవడం అతనికీ, అభిమానులకూ బాధ కలిగించేది. కెరీర్‌ చరమాంకంలో ఉన్న కోహ్లి ఇక ఈ కల నెరవేరకుండానే వీడ్కోలు చెబుతాడేమోనన్న ఆందోళన కూడా కనిపించింది. కానీ 2025లో ఆ భయం అంతా తుడిచిపోయింది. టోర్నీలో జట్టు టాప్‌ స్కోరర్‌గా, మొత్తం మూడో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన విరాట్‌కు చివరకు కప్పు అందింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో 2025 ఏడాదిని గుర్తు చేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Exit mobile version