Site icon NTV Telugu

RCB-IPL 2026: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి ఆ స్టార్ పేసర్ దూరం..

Rcb Ipl Title

Rcb Ipl Title

RCB-IPL 2026: ఐపీఎల్ సీజన్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ నువాన్ తుషారా టోర్నమెంట్ మొత్తానికి దూరమవ్వనున్నాడు. ఇప్పటికే జోష్ హేజిల్‌వుడ్ భాగస్వామ్యంపై అనిశ్చితి నెలకొంది. ఈ తరుణంలో ఫ్రాంచైజీకి మరో చేదు వార్త వచ్చింది. తాజాగా గాయపడిన ఆటగాళ్ల జాబితాలో తుషారా చేరడంతో మరో దెబ్బ తగిలింది. గత సీజన్‌లో ఈ శ్రీలంక పేసర్‌ను ఆర్‌సీబీ 1.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. లీగ్ రెండవ దశ నాటికి హేజిల్‌వుడ్ కోలుకుంటాడని భావిస్తుండగా, తుషారాకు శ్రీలంక క్రికెట్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించకపోవడంతో అతను ప్రస్తుతానికి జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇద్దరు కీలక ఫాస్ట్ బౌలర్లు లేకుండానే ఆర్‌సీబీ బరిలోకి దిగనుంది.

READ MORE: Sri Rama Navami 2026: శ్రీరాముడి పూజా విధానం, శుభ ముహూర్తం, హారతి విధానం

శ్రీలంక మీడియా సంస్థ న్యూస్‌వైర్ నివేదిక ప్రకారం.. తుషారకు ప్రస్తుతం ఎలాంటి గాయం లేనప్పటికీ.. శ్రీలంక క్రికెట్ అతనికి ఎన్ఓసి (NOC) ఇవ్వడానికి నిరాకరించింది. అతని ఫిట్‌నెస్ (Physical Performance Test) ఆశించిన స్థాయిలో లేదని బోర్డు భావిస్తోంది. బోర్డు నిర్వహించిన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన దుష్మంత చమీర, పాతుమ్ నిస్సంక వంటి ఆటగాళ్లకు మాత్రమే క్లియరెన్స్ ఇచ్చారు. తుషార మాత్రమే కాదు, జట్టులోని మరో ప్రధాన బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ సైతం ఐపీఎల్ మొదటి దశకు దూరం కానున్నాడు. దీంతో ఆర్సీబీ బౌలింగ్‌పై ఆందోళన మొదలైంది. మరోవైపు.. యశ్ దయాల్ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాళ్లు లేకపోయినా, రాజత్ పాటిదార్ సారధ్యంలోని ఆర్‌సీబీ.. రాసిఖ్ దార్, అభినందన్ సింగ్ వంటి దేశీ ఆటగాళ్లతో తమ టైటిల్ వేటను మొదలుపెట్టనుంది.

Exit mobile version