Silver Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సామాన్యులకు అత్యవసర ఆర్థిక అవసరాల సమయంలో ఉపశమనాన్ని అందించే లక్ష్యంతో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. “Reserve Bank of India (Lending Against Gold and Silver Collateral) Directions, 2025” పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ.. త్వరలో బంగారంతో పాటు వెండి ఆభరణాలు, నాణేలపై కూడా రుణ సదుపాయం కల్పించనుంది. ఈ నూతన నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కేవలం బంగారంపైనే లోన్ లభించేది. అయితే, ఇప్పుడు తొలిసారిగా వెండిపై కూడా రుణాల కోసం RBI అనుమతి ఇవ్వడం విశేషం.
Vida VX2 Go: విడా VX2 Go కొత్త వేరియంట్ విడుదల.. 3.4 kWh బ్యాటరీ.. సింగిల్ ఛార్జ్ తో 100KM రేంజ్
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. వాణిజ్య బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అర్బన్ లేదా రూరల్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, అలాగే NBFCలు (Non-Banking Financial Companies) వెండిపై రుణాలు అందించగలవు. అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటంటే వెండి కడ్డీలు (Bullion), బార్‌లు లేదా ETF/మ్యూచువల్ ఫండ్‌ల వంటి ఆర్థిక ఆస్తులపై రుణాలు ఇవ్వబడవు. ఇక తాకట్టు పరిమితి విషయంలో వెండి ఆభరణాలు గరిష్టంగా 10 కిలోల వరకు, వెండి నాణేలు 500 గ్రాముల వరకు మాత్రమే తీసుకుంటారు. ఇక బంగారు ఆభరణాలకైతే ఒక కిలో, బంగారు నాణేలు 50 గ్రాముల వరకు మాత్రమే తాకట్టు పెట్టవచ్చు.
ఇకపోతే రుణ పరిమాణాన్ని నిర్ణయించడంలో లోన్-టు-విలువ నిష్పత్తి (LTV Ratio) కీలక పాత్ర పోషిస్తుంది. రూ.2.5 లక్షల లోపు రుణాలపై గరిష్ట LTV 85%, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 80%, రూ.5 లక్షల కంటే ఎక్కువ రుణాలపై 75%గా నిర్ణయించారు. ఉదాహరణకు ఒకరి వెండి విలువ ఒక లక్ష అయితే వారు గరిష్టంగా రూ.85,000 మాత్రమే రుణం పొందగలరు. వెండి విలువను నిర్ణయించడంలో పారదర్శకతను చూపేందుకు RBI స్పష్టమైన విధానం రూపొందించింది. వెండి ధరను గత 30 రోజుల సగటు ముగింపు ధర లేదా మునుపటి రోజున ముగింపు ధర ఈ రెండింటిలో తక్కువదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రేట్లు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) లేదా SEBI నియంత్రిత కమోడిటీ ఎక్స్చేంజ్ డేటా ఆధారంగా నిర్ణయించబడతాయి.
రుణం తిరిగి చెల్లించిన తర్వాత.. తాకట్టు పెట్టిన వెండిని ఏడు పనిదినాల్లోపు తిరిగి లోన్ ఇచ్చిన బ్యాంక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యం జరిగితే.. బ్యాంకు ప్రతి ఆలస్యమైన రోజుకు రూ.5,000 పరిహారం చెల్లించాలి. అదే విధంగా లోన్ తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో విఫలమైతే.. తాకట్టు పెట్టిన వెండిని వేలం ద్వారా విక్రయించవచ్చు, కానీ ముందు కనీసం ఒక నెల ముందుగా నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఇక వేలం ధర ప్రస్తుత విలువలో కనీసం 90%గా ఉండాలి. ఇలా ఒకవేళ రెండు సార్లు వేలం విఫలమైతే దాన్ని 85%కి తగ్గించవచ్చు. ఈ కొత్త నిబంధనలతో RBI రుణాల సౌలభ్యాన్ని పెంచడం, అనధికార రుణ పద్ధతులను తగ్గించడం, అలాగే బంగారంతో పాటు వెండిపై రుణాలలో పారదర్శకతను తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
