Ravi Bishnoi: రవి బిష్ణోయ్‌లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..

Ravi Bishnoi

Ravi Bishnoi

ఇండియన్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ సునీల్ జోషి నిన్న జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సాధించిన పురోగతిపై ప్రశంసలు కురిపించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిష్ణోయ్ 4 ఓవర్లలో 60 రన్లు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోగా, జింబాబ్వేపై మాత్రం 4 ఓవర్లలో 24 రన్లు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ సాధించి మళ్లీ తన లయను అందుకున్నారు. బిష్ణోయ్ తన బౌలింగ్ యాక్షన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, కానీ రన్-అప్‌లో చిన్న మార్పు చేసుకోవడం వల్లే ఈ మంచి ఫలితం వచ్చిందని జోషి తెలిపారు. అతడు ప్రస్తుతం రిటర్న్ క్రీజ్‌కు బాగా దగ్గరగా వెళ్లకుండా బౌలింగ్ చేయడం ఎంతో ప్రయోజనకరంగా మారిందని పేర్కొన్నారు.

అలాగే యువ ఆల్‌రౌండర్ సూర్యాంశ్‌ షెడ్గే నైపుణ్యాన్ని కొనియాడిన జోషి, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే తరహాలోనే ఇతడు కూడా భారత జట్టులో స్థిరపడే సత్తా ఉన్న ఎదుగుతున్న ఆటగాడని, అతనికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గాయం నుంచి కోలుకుని బలమైన పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌తో పాటు ఆకట్టుకున్న అశోక్ శర్మల బౌలింగ్‌ను ఆయన ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. వీరిద్దరూ భారత వేగవంతమైన బౌలింగ్ విభాగ బలాన్ని మరింత పెంచారని అభిప్రాయపడ్డారు.

ఇక అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లను పార్ట్‌టైమ్ బౌలర్లుగా ఉపయోగించుకోవడంపై మాట్లాడుతూ.. అభిషేక్ బౌలింగ్‌లో ఎంతో పురోగతి సాధించాడని, తిలక్ వర్మ కూడా మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాడని అన్నారు. కాగా మరో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విషయంలో మాత్రం ప్రస్తుతానికి అతని బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, తగిన సమయం వచ్చినప్పుడు నిపుణుల సమక్షంలో అతని బౌలింగ్ నైపుణ్యాలపై పని చేస్తామని జోషి స్పష్టం చేశారు.