Site icon NTV Telugu

Rare Vulture: నేపాల్‌లో 10 నెలల క్రితం మిస్సింగ్‌.. బీహార్‌లో ప్రత్యక్షం

Rare Vulture

Rare Vulture

Rare Vulture: రాబందు.. ఈ పేరు వినడమే కానీ, వాటిని నిజంగా చూసిన వారు ఈ తరంలో తక్కువ మందే. అదికూడా జంతు ప్రదర్శనశాలలోనో లేదా సినిమాల్లో చూసి ఉంటారు. పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే పక్షి జాతుల్లో రాబందులు ప్రధానమైనవి. కాలం విసిరిన సవాళ్లను ఎదుర్కోలేని స్థితిలో రాబందుల రెక్కలు విరిగిపోయాయి. ఆ జాతి క్రమంగా కనుమరుగైపోతోంది. ఈ పరిస్థితి పక్షి ప్రేమికులనే కాదు.. పర్యావరణ హితం కోరే వారినీ ఆందోళనకు గురి చేస్తోంది. పర్యావరణాన్ని ప్రభావితం చేసే పక్షుల్లో కీలకమైన రాబందులు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దాంతో వాటిని కనుమరుగైపోతున్న జీవుల జాబితాలో చేర్చారు.

ఈ క్రమంలో నేపాల్‌కు చెందిన ఓ అరుదైన రాబందు 10 నెలల క్రితం అక్కడి తప్పిపోయింది. రేడియో కాలర్‌ అమర్చి ఉన్న ఆ రాబందు నేపాల్‌ పక్షి సంరక్షకుల పర్యవేక్షణ నుంచి తప్పిపోయింది. ఇన్నాళ్లు జాడ తెలియకుండా తిరిగిన రాబందు ఇప్పుడు బీహార్‌లో ప్రత్యక్షమైంది. తిండి కోసం తిరిగి అలసిపోయిన ఆ పక్షి పూర్తిగా బలహీనస్థితిలో దొరికింది. అరుదైన తెల్లటి రాబందును దర్భంగా వద్ద బీహార్ బర్డ్ రింగింగ్ స్టేషన్ అధికారులు కనుగొన్నారు. దానికి ఆహారం అందజేశారు. అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ పక్షి నేపాల్‌లోని తనహున్ జిల్లాలో చివరిసారిగా కనిపించింది. ఆహారం లేకపోవడంతో అది బలహీనమైన స్థితిలో కనిపించిందని అధికారులు తెలిపారు. దాంతో బీహార్‌ అధికారుల కష్టానికి నేపాల్‌ అధికారులు అభినందనలు తెలియజేశారు. కాగా, జనాభా వేగంగా తరగిపోవడంతో 2000 సంవత్సరంలో రాబందులను అంతరించిపోతున్న జీవజాతుల్లో చేర్చారు.

మయన్మార్, థాయిలాండ్, లావోస్, కంబోడియా మరియు దక్షిణ వియత్నాంతో పాటు, సాధారణంగా మానవ నివాసాలకు సమీపంలో కనిపించే తెల్లటి రాబందులు, భారత ఉపఖండంలో చాలా సాధారణం. ఈ పక్షులు ఎక్కువగా నేలపైనే తింటాయి, కానీ చెట్లు,కొండలపై గూడు కట్టుకుంటాయి. గాలి ప్రవాహాలపై ఎగురుతూ ఆహారం కోసం వెతుకుతూ ఎక్కువ సమయం గడుపుతాయి.

ఈ పక్షి మధ్యస్థ పరిమాణంలో, నల్లగా ఉండే ఈకలు, తెల్లటి మెడ-రఫ్, దిగువ వీపుతో పాటు ఎగువ తోకపై తెల్లటి పాచ్ ఈకలు కలిగి ఉంటుంది. వయోజన తెల్లటి రాబందు 75 నుంచి 85 సెం.మీ పొడవు ఉంటుంది. తప్పిపోయిన పక్షిని నేపాల్ అధికారులు రాబందుల సేఫ్ జోన్‌లో పరిశోధన, పర్యవేక్షణ కోసం ఉపయోగిస్తున్నారని చీఫ్‌ వైల్డ్‌లైఫ్ వార్డె పీకే గుప్తా చెప్పారు.పక్షి బలహీనంగా ఉందని, వెంటనే ఆహారం అందించామని తెలిపారు. భాగల్‌పూర్‌లోని బర్డ్ రింగింగ్ అండ్ మానిటరింగ్ స్టేషన్‌లో రాబందు పరిశీలనలో ఉందని, కొన్ని రోజుల తర్వాత విడుదల చేస్తామని ఆయన చెప్పారు. హర్యానాలోని పింజోర్‌లోని జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, ఇంగ్లండ్‌లోని రాయల్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ పక్షిని గుర్తించిన వెంటనే అప్రమత్తమైనట్లు తెలిపారు.

Facial Recognition Attendance: అటెండెన్స్ విషయంలో కీలక మార్పు.. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా..

ఏప్రిల్‌లో నేపాల్‌లోని తనహులోని అబుఖైరేనిలో ఉన్నప్పుడు పక్షికి జోడించిన రేడియో కాలర్ డేటాను ప్రసారం చేయడం ఆగిపోయింది. ఇది చివరిసారిగా సెప్టెంబర్ 3న అదే ప్రాంతంలో కనిపించిందని గుప్తా తెలిపారు. బర్డ్ రింగింగ్ (ట్యాగింగ్) స్టేషన్‌ను కలిగి ఉన్న దేశంలో బీహార్ నాల్గవ రాష్ట్రం. పక్షుల వలస తీరు, మరణాలు, ప్రాదేశికతలను అధ్యయనం చేసేందుకు వాటి కాళ్లకు ఉంగరాలు వేస్తారని తెలిపారు. భాగల్‌పూర్ బర్డ్ రింగింగ్ స్టేషన్ గత ఏడాది అక్టోబర్‌లో మంగోలియన్ పల్లాస్ ఫిష్ డేగను రక్షించింది.

Exit mobile version