Raptee T30 Launch Price and Range: చెన్నైకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ‘రాప్టీ’.. కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేసింది. ‘రాప్టీ టీ30’ పేరిట భారతదేశపు మొట్టమొదటి హై-వోల్టేజ్ (హెచ్‌వీ) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ టీ30, టీ30 స్పోర్ట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. రెండింటి ధర రూ.2.39 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల కోసం ఉపయోగించే టెక్నాలజీనే ఈ ఎలక్ట్రిక్ బైక్ రూపకల్పనలో ఉపయోగించామని కంపెనీ చెబుతోంది.
అధిక వోల్టేజ్ సాంకేతికతతో వచ్చిన భారతదేశంలోని మొదటి ద్విచక్ర వాహనాలే ఈ రాప్టీ ఎలక్ట్రిక్ బైక్‌లు. ఎలక్ట్రిక్ కార్లకు ఉపయోగించే ఛార్జింగ్ ప్రమాణాలు ఇందులో ఉంటాయి. ఇవి ఆన్‌బోర్డ్ ఛార్జర్‌తో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న 13,500 సీసీ ఎస్2 కార్ ఛార్జింగ్ స్టేషన్‌లకు అనుకూలంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌ల డెలివరీలు జనవరి 2025లో ప్రారంభమవుతాయి. కొనుగోలుదారులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా రూ.1,000 చెల్లించి మోటార్‌సైకిల్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. మొదట చెన్నై, బెంగళూరులో అమ్మకాలు మొదలవుతాయి. ఆ తర్వాత మరో 10 నగరాల్లో ప్రారంభించేందుకు కంపెనీ ప్లాన్ చేసింది.
రాప్టీ టీ30లో 5.4kWh కెపాసిటీ గల 240 వోల్ట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఛార్జ్‌లో 200 కిమీల ప్రయాణం ఇస్తుంది. ఈ బైక్ కనీసం 150 కిమీల రేంజ్ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ 3.5 సెకన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 135 కిమీ. 40 నిమిషాల్లో 20 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది IP67 రేటెడ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. బ్యాటరీ లైఫ్ 8 ఏళ్లు లేదా 80000 కిమీల వారంటీ కలిగి ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
Also Read: Honda Activa 7G Launch: హోండా యాక్టివా 7జీ వచ్చేస్తోంది.. మైలేజ్ తెలిస్తే మైండ్ బ్లాకే!
ఈ బైక్‌లో మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. వినియోగదారు తన రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు. లుక్, డిజైన్ పరంగా ఇది స్పోర్ట్స్ బైక్‌ను పోలి ఉంటుంది. స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌తో పాటు టచ్‌స్క్రీన్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇందులో బైక్ స్పీడ్, బ్యాటరీ, టైమ్, స్టాండ్, బ్లూటూత్ కనెక్టివిటీ, జీపీఎస్ నావిగేషన్ వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. స్ప్లిట్ సీట్‌తో వస్తున్న ఈ బైక్ వెనుక భాగంలో గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.