Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..

Bangalore

Bangalore

అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన ఉన్మాది దాడి ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పాఠశాల ఆవరణలోనే విద్యార్థినిపై దాడి జరగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించి.. జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, విద్యాశాఖ అధికారులతో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరం, ఆమెకు మరింత మెరుగైన అత్యవసర వైద్యం అందించాల్సిన అవసరం ఉందని భావించి, బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు.

విద్యార్థిని ప్రాణాలను కాపాడటమే ధ్యేయంగా మంత్రి లోకేష్ స్వయంగా బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి ఉన్నత స్థాయి వైద్య బృందంతో మాట్లాడారు. బాధితురాలికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ప్రత్యేకంగా కోరారు. ఆస్పత్రికి త్వరగా చేర్చేందుకు ఎలాంటి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ‘గ్రీన్ ఛానల్’ ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఏర్పాట్లు పూర్తి చేయించారు.

స్థానిక ఆసుపత్రి నుంచి బెంగళూరు తరలించే వరకు ప్రతి క్షణం అధికారులతో, వైద్యులతో మంత్రి సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించారు. విద్యార్థినికి అవసరమైన అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, ఆమె త్వరగా కోలుకోవడానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.