Raptadu School Attack Updates: అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం ఉదయం పాఠశాలలోకి చొరబడిన హేమంత్ అనే యువకుడు చెట్లు నరికేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ రంపంతో ఓ విద్యార్థినిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక ముఖం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని పైనా నిందితుడు దాడి చేయడంతో ఆమె రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థినుల కేకలు విన్న ఇతర విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. దీంతో నిందితుడు రంపాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు.
దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు హేమంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడు దాక్కున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని చుట్టుముట్టారు. ఈ క్రమంలో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ సీఐపై దాడికి దిగాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి రెండు కాళ్లకు గాయాలయ్యాయి. అతడిని వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హేమంత్ రెండు మోకాళ్ల కింది భాగాల్లో బుల్లెట్లు తగిలాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు ఇప్పటికే నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. కుడి కాలులో ఇంకా మూడు బుల్లెట్లు ఉన్నాయి.
నిందితుడు హేమంత్ కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వాటిని తొలగించేందుకు డాక్టర్లు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో హేమంత్ కాళ్లకు వైదులు ఆపరేషన్ చేయనున్నారు. మరోవైపు ఘటన జరిగిన రోజు గాయపడిన ఇద్దరు విద్యార్థినులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం కోలుకుంటోంది. పాఠశాలలో జరిగిన ఈ దాడి ఘటన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

