జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Hemant Soren) కోర్టులో చుక్కెదురైంది. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను రాంచీ పీఎంఎల్‌ఏ కోర్టు (Ranchi PMLA Court) తిరస్కరించింది.
శుక్రవారం నుంచి అసెంబ్లీ (Assembly) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన రాంచీ పీఎంఎల్‌ఏ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది.
మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. అయితే తన వారసుడిగా చంపయ్ సోరెన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. అనంతరం అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్‌టెస్ట్‌కు హేమంత్‌కు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. అదే మాదిరిగా మరోసారి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు కోర్టు అనుమతి కోరారు. కానీ అందుకు న్యాయస్థానం అభ్యర్థనను తిరస్కరించింది.
ఇదిలా ఉంటే చంపయ్ సోరెన్ ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేశారు. ఈ విస్తరణ కూటమిలో అలజడి రేపింది. తమకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా ఫిర్యాదు చేసి వచ్చారు. తాజాగా శాసనసభా సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో వేచి చూడాలి.