Site icon NTV Telugu

RGV-Show Man: రామ్‌గోపాల్ వర్మ హీరోగా “షో మ్యాన్”.. మాస్ లుక్‌లో ఆర్జీవీ..

Rgv1

Rgv1

RGV-Show Man: సంచలనాలకు ప్రతీకగా నిలిచిన రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో ప్రయోగాలు, వివాదాలు, విభిన్నమైన కథాంశాలతో దర్శకుడిగా వందలాది మంది అభిమానం సంపాదించిన ఆర్జీవీ ఇప్పుడు కెమెరా ఎదుట ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తానే హీరోగా వస్తుండటమే కాదు, ఈ ప్రయత్నాన్ని సాధారణ సినిమా ప్రయోగంలా కాకుండా తన వ్యక్తిత్వాన్నే ప్రతిబింబించేలా “షో మ్యాన్” అనే టైటిల్‌తో మలచుకుంటున్నాడు. ఈ చిత్రానికి “మ్యాడ్ మాన్‌స్టర్” అనే విభిన్న ట్యాగ్‌లైన్ ఇవ్వడం వర్మ స్టైల్‌నే గుర్తు చేస్తోంది. ఆయన కెరీర్ అంతా గ్యాంగ్‌స్టర్, అండర్ వరల్డ్ డాన్‌ల కథలతో ముడిపడింది. అదే తెరపై కొత్త రూపంలో చూపాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. వర్మ స్టైల్ సినిమాలో నటుడిగా ఎలా కనిపిస్తాడు, ఆయన నటన కూడా దర్శకత్వం లాగానే ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. మరోవైపు.. ఈ సినిమాలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. మెయిన్‌స్ట్రీమ్ హీరోలతో, ముఖ్యంగా రజినీకాంత్ వంటి దిగ్గజాలతో పోటీగా నిలిచే విలన్ పాత్రలు చేసిన సుమన్.. ఇప్పుడు వర్మతో ఒక కొత్తరకమైన స్క్రీన్ ఎనర్జీని పంచుకోనున్నాడనేది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయనే అంచనాలు ఉన్నాయి.

READ MORE: Healthy Chicken Eating Tips: చికెన్ రెగ్యులర్ గా తింటున్నారా.. వండేటపుడు ఈ టిప్స్ పాటించండి..

కొత్త దర్శకుడు నూతన్ ఈ సినిమాతో రంగప్రవేశం చేస్తున్నాడు. ఆర్జీవీ వంటి వ్యక్తిత్వాన్ని మొదటి సినిమానే నాయకుడిగా తెరకెక్కించడం ఎంతో మంచి అవకాశం. నూతన్‌ ఆలోచనల ధైర్యం, దర్శకునిగా తీసుకోవాల్సిన రిస్క్‌లకు సిద్ధమయ్యాడన్న సంకేతమిది. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, అన్నీ కొత్త దర్శకుడికే అప్పగించడమంటే వర్మ అతనిలోని కొత్తదనాన్ని గుర్తించినట్టే. తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. వర్మతో ఇంతకుముందు చేసిన ప్రయోగాత్మక చిత్రాల అనుభవంతో ఈ ప్రాజెక్ట్‌ను మరింత విస్తృతంగా రూపొందిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి సీజన్‌కు ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉండగా, విడుదల తేదీని కూడా అదే సందర్భంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

Exit mobile version