టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ సినిమా ‘శివ’. 1989 అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన శివ టాలీవుడ్ ధోరణిని పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాతో నాగార్జున ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర ఈ సినిమా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల సందర్భంగా నవంబర్ 14న శివ రీ రిలీజ్ అవుతోంది. రీ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ ఆర్జీవీ శివ సీక్వెల్‌పై ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
నాగ చైతన్య, అఖిల్‌లలో ‘శివ’ సీక్వెల్ ఎవరితో తీస్తారు? అనే ప్రశ్నకు.. ‘శివ సినిమా కేవలం నాగార్జున గారి కోసమే. ఆయనను తప్ప మరో హీరోని అస్సలు ఊహించుకోలేను. ఇంకో 36 ఏళ్లయినా, నేను కాకుండా మరొకరు చేసినా ఊహించుకోలేను. ఒకవేళ సీక్వెల్ చేయాల్సి వస్తే నాగ చైతన్య, అఖిల్‌తో చేయను. నాగార్జునతోనే సినిమా’ అని ఆర్జీవీ స్పష్టం చేశారు. వెంటనే కింగ్ మాట్లాడుతూ.. నన్ను చూడండి, నేనే శివ సీక్వెల్ చేస్తా అని నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
