Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..

Rakul Preet Singh

Rakul Preet Singh

Tax Raids: బాలీవుడ్‌లో మరోసారి ఐటీ (ఇన్‌కమ్ టాక్స్) శాఖ దాడులు కలకలం రేపాయి. సినిమాల నిర్మాణాల పేరుతో విదేశాలకు అక్రమంగా నిధులు తరలిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు, పన్ను ఎగవేతల అనుమానాలతో ముంబై ఇన్‌కమ్ టాక్స్ అధికారులు ఒకేసారి పలువురు ప్రముఖులు, నిర్మాణ సంస్థల ఇళ్లపై, ఆఫీసులపై మెరుపు దాడులు చేపట్టారు. ఈ దాడుల జాబితాలో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ బాలీవుడ్ నిర్మాత వాసు భగ్నానీతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పానోరమా స్టూడియోస్’ లాంటి పెద్ద పేర్లు ఉండటం విశేషం. వీరితో ముడిపడి ఉన్న దాదాపు 12 ప్రాంతాల్లో ముంబై ఐటీ విభాగానికి చెందిన వేర్వేరు బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి.

సినిమా షూటింగ్‌లు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ వ్యయాల సాకుతో భారీగా నిధులను విదేశాలకు తరలిస్తున్నట్లు ఐటీ శాఖకు కొద్దిరోజులుగా పక్కా సమాచారం అందుతోంది. ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున పన్నుల అవకతవకలు, ఆర్థిక అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు బలంగా అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ రడార్‌లో నిలిచిన వారిలో సౌత్, బాలీవుడ్‌లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్, ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై ఎన్నో భారీ చిత్రాలను తీసిన ప్రముఖ నిర్మాత వాసు భగ్నానీ, అలాగే ‘దృశ్యం’ ఫ్రాంచైజీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన ‘పానోరమా స్టూడియోస్’ ముఖ్యంగా ఉన్నాయి. ఒక్కసారిగా ఐటీ అధికారులు రంగంలోకి దిగడంతో సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం నెలకొంది. ఇక ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు పూర్తయిన తర్వాత, ఈ ఆర్థిక మోసానికి సంబంధించి ఐటీ శాఖ కీలకమైన విషయాలను వెల్లడించవచ్చని భావిస్తున్నారు.