Raksha Bandhan 2024 Good Timings: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ ‘రక్షాబంధన్’. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు రక్షాబంధన్ పండగను జరుపుకొంటారు. ఈ ఏడాది సోమవారం (ఆగస్టు 19) రక్షాబంధన్ పండుగ వచ్చింది. ఈ రోజున సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడతారు. సోదరులు కూడా సోదరీమణులకు నిత్యం రక్షణగా ఉంటానని హామీ ఇస్తూ.. బహుమతి కూడా ఇస్తారు. నేడు రాఖీ కట్టడానికి సరైన సమయం ఏంటో ఓసారి చూద్దాం.
శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 19 తెల్లవారుజామున 3:04 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 19 రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. సోమవారం ఉదయం 5.53 గంటల నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు భద్రకాలం ఉంటుంది. ఉదయం 7.31 నుంచి 9.08 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. భద్రకాలం, రాహుకాలంలో రాఖీ కట్టకూడదు.
శాస్త్రాల ప్రకారం… భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు. భద్రకాలంలో రాఖీ కడితే అశుభం జరుగుతుందని చెబుతారు. భద్రకాలం ముగిసిన తరువాత సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కడితే మంచిదని పండితులు అంటున్నారు. సోమవారం భద్రకాల సమయం తెల్లవారుజామున 5.33 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 1.33 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 1.34 నుంచి రాత్రి 9.08 గంటల వరకు శుభసమయం ఉంది. ఈ శుభసమయంలో సోదరీమణులు సోదరులకు రాఖీ కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని, సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
