NTV Telugu Site icon

Rajyasabha Results: 8 స్థానాల్లో ఫలితాలు.. కాంగ్రెస్, బీజేపీలకు చెరో నాలుగు

Rajyasabha

Rajyasabha

నాలుగు రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, రాజస్థాన్‌లలోని నాలుగేసి స్థానాల ఫలితాలు మాత్రమే వెలువడ్డాయి. ఇందులో కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో నాలుగు స్థానాలు దక్కాయి. మహారాష్ట్రలో ఆరు, హరియాణాలో రెండు స్థానాలకు ఎన్నికలు ముగిసినా.. అక్కడ ఓట్ల లెక్కింపు జరగలేదు. బీజేపీ ఫిర్యాదుతో హరియాణా, మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు నిలిపేసింది ఎన్నికల సంఘం. రెండు రాష్ట్రాల్లోని ఫలితాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలో నాలుగు స్థానాలకు శుక్రవారం పోలింగ్​ జరగగా.. మూడు స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ తరఫున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​, ప్రముఖ నటుడు, రాజకీయ నేత జగ్గేశ్​, మాజీ ఎమ్మెల్సీ లెహర్​ సింగ్​ సిరోయాలు గెలుపొందారు. కాంగ్రెస్​ తరఫున బరిలో దిగిన కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్​ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాజస్థాన్‌లో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు పోలింగ్​ జరగగా.. మూడింట అధికార కాంగ్రెస్​ పార్టీ గెలుపొందింది. భాజపా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ అభ్యర్థులు రణ్‌దీప్​ సుర్జేవాలా, ముకుల్​ వాస్నిక్​, ప్రమోద్​ తివారీలు ఎన్నికైనట్లు రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ ట్వీట్ చేశారు. భాజపా తరఫున బరిలో దిగిన మాజీ మంత్రి ఘనశ్యామ్​ తివారీ విజయం సాధించారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌సీపీ నేతలు, ఆ రాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌, మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. అక్రమాస్తులు, మామూళ్ల వసూలు, మాఫియాతో సంబంధాలు తదితర ఆరోపణలపై ప్రస్తుతం వీరు జైల్లో ఉన్నారు. మరోవైపు… మహారాష్ట్ర, హరియాణాల్లో కొందరు కాంగ్రెస్‌ సభ్యులు తాము ఓటేసిన బ్యాలెట్లను బహిరంగంగా ప్రదర్శించారని.. ఆ ఓట్లను చెల్లనివిగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్‌ నిలిపివేశారు.