NTV Telugu Site icon

Moinabad Farm House: 64 మందిని అరెస్ట్ చేశాం.. సొంత కార్లలో కోళ్లను తీసుకొచ్చారు: డీసీపీ

Rajendra Nagar Dcp

Rajendra Nagar Dcp

హైదరాబాద్‌ శివారు మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందేలు, క్యాసినో నిర్వహణ గుట్టు రట్టయింది. క్యాసినో, కోడిపందేలు ఆడుతున్న వారిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోడిపందేలతో పాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌పై దాడిలో మొత్తంగా 64 మందిని అరెస్ట్ చేశారు. ఆర్గనైజర్లు భూపతి రాజు, శివకుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడిలో 30 లక్షల రూపాయల నగదు, 55 లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్, పేకాట కార్డ్స్, పందెం కోళ్ల కోసం వాడే 46 కోడి కత్తులను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఫామ్‌హౌస్‌ ఘటనపై ఎన్టీవీతో రాజేంద్ర నగర డీసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. ‘నిన్న రాత్రి మొయినాబాద్‌లో పెద్ద ఎత్తున క్యాసినో, కోడిపందేలు జరిగాయి. కోడిపందేల కోసం భీమవరం నుండి ప్రత్యేకంగా కోళ్లను తెప్పించారు. ఈ కోళ్లను డీసీఎంలలో కాకుండా సొంత కార్లలో ఏపీ నుండి తెలంగాణకు తీసుకొచ్చారు. ఒక్కో కోడిని ప్రత్యేకంగా ప్యాక్ చేసుకుని కార్లలో తీసుకొచ్చారు. 64 మందిలో 51 మంది ఏపీ వారే ఉన్నారు. ఏడు మంది మాత్రమే హైదరాబాద్ నగరంకు చెందిన వారున్నారు. ల్యాండ్ ఓనర్‌పైన కూడా కేస్ పెడుతాము. కోడిపందేలు జరుగుతాయని తెలిసే లాండ్ ఓనర్ రెంటుకు ఇచ్చాడు. 64 మందికి నోటీసులు ఇచ్చాము, వారు కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది. మెయిన్ ఆర్గనైజర్ శివకుమార్ పై గతంలో క్రిమినల్ కేసు ఉంది. ప్రస్తుతం వెరిఫై చేస్తున్నాము. పెద్ద ఎత్తున ఆన్లైన్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ గుర్తించాము . కోడిపందేలు, క్యాసినో గేమ్ లో పాల్గొన్న వారి కార్లు సీజ్ చేశాం’ అని డీసీపీ శ్రీనివాస్ చెప్పారు.