రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రికి హత్య బెదిరింపులు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ హయాంలోని భజన్‌లాల్ శర్మ కేబినెట్‌లో గిరిజన శాఖ మంత్రిగా ఉన్న బాబులాల్ ఖరాడీని చంపేస్తామంటూ కొందరు వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన్ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక, ఈ బెదిరింపులపై మంత్రి ఖరాడి పోలీసులకు కంప్లైంట్ చేశారు. 3 రోజుల క్రితం ఈ బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. గిరిజనులను బలవంతంగా హిందూ మతంలోకి మారుస్తున్నారని ఆరోపిస్తూ మంత్రిని చంపేస్తానని గుర్తు తెలియని వ్యక్తి ఈ బెదిరింపులకు దిగినట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై ఉదయ్‌పూర్‌లోని కొద్దా పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
Read Also: Uddhav Thackeray: బీజేపీ హిందుత్వం గోమూత్రంపై ఆధారపడింది..
అయితే, ఇంతకు ముందు కూడా మంత్రి బాబులాల్ ఖరాడీకి చంపేస్తామని బెదిరింపులు రావడం ఇది రెండోసారి. ఈ ఘటనపై నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఇక, బార్మర్ జైసల్మేర్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రవీంద్ర సింగ్ భాటికి కూడా ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ ఐడీని ఉపయోగించి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అనంతరం నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు బలోత్రాకు చెందిన ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్న మేఘరామ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు ఆయనకు పీఎస్‌వో భద్రత కల్పించారు.
