NTV Telugu Site icon

Rajahmundry Airport: సర్కార్‌ కీలక నిర్ణయం.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి మహర్దశ

Rajahmundry Airport

Rajahmundry Airport

Rajahmundry Airport: రాజమండ్రి మధురపూడి విమానాశ్రయం అభివృద్ధిలో మరో ముందడుగు వేస్తోంది. బ్రిటీష్‌ కాలం నుంచి ఇప్పటి వరకు దశలవారీగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతూనే ఉంది. గతంలో రూపొందించిన కార్యాచరణకు పచ్చజెండా పడటంతో మొత్తం రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న టెర్మినల్ భవనానికి మరో పెద్ద టెర్మినల్ భవనం నిర్మాణానికి భారతీయ పౌర విమానయాన సంస్థ శ్రీకారం చుట్టనుంది. విమానాశ్రయం పాత టెర్మినల్ భవనానికి పచ్చ జెండా ఊపారు. 347 కోట్ల 15 లక్షల రూపాయల అత్యాధునిక సాంకేతికతతో దీన్ని నిర్మిస్తారు. 225 మంది ప్రయాణికులకు సరిపడా ఉన్న భవనాన్ని 1400 మంది ఒకేసారి రాకపోకలకు వీలుగా విస్తరిస్తారు. ఇందులోనే వీఐపీ లాంజ్, ఎస్కలేటర్లు, ఫర్నీచర్, లగేజీ యంత్రాలు వంటి సదుపాయాలు కల్పిస్తారు. నిర్మాణంలో భాగంగా మూడు ఏరో వంతెనలు సిద్ధం చేస్తున్నారు. వీటి ద్వారా ప్రయాణికులు టెర్మినల్ నుంచి నేరుగా విమానాల్లోకి చేరుకోవచ్చు. ప్రస్తుతం టెర్మినల్ భవనం నుంచి రన్ వేపై ఉన్న విమానాల దగ్గరకు బస్సుల్లో చేరుకుంటున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగానే ఏరో వంతెనలు నిర్మాణం చేపడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న ఏప్రాన్ సామర్థ్యం పెరగనుంది. 4 పెద్ద విమానాలు, రెండు చిన్న విమానాలు, 8 హెలికాప్టర్లు నిలిచేందుకు వీలుగా ఏప్రాన్‌ను విస్తరిస్తారు. వీటితో పాటు మరో రెండు పెద్ద విమానాలు ఆగేందుకు అనువుగా పెంచనున్నారు. టెర్మినల్ విస్తరణతో పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలత ఏర్పడనుంది. ప్రస్తుతం 72 మంది మాత్రమే ప్రయాణించేందుకు ఏటీఆర్ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఏరో వంతెనలు, టెర్మినల్ విస్తరణతో పాటు 1750 మీటర్లు ఉన్న రన్‌వేను 3,165 మీటర్లకు విస్తరిస్తే బోయింగ్, ఎయిర్ బస్‌ల రాకపోకలకు మార్గం ఏర్పడుతుంది. ఇవి 180 నుంచి 220 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రయాణిస్తాయి.

టెర్మినల్ విస్తరణతో విమా నాశ్రయం మరింత అభివృద్ధి పథంలోకి వెళుతుంది. కొత్త టెర్మినల్‌కు 347 కోట్లు 15 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతీరావు సింధియా శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు ఏరో వంతెనలు నిర్మాణంతో పెద్ద విమాన సర్వీసులకు అనుకూలంగా ఉంటుంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం రాజమండ్రి విమానాశ్రయానికి మహర్దశ కలగబోతోంది. ‘రాజమండ్రి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ స్థాయి’గా అభివృద్ధి చేయాలన్న సంకల్పం కార్యరూపం దాల్చబోతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త హంగులతో సర్వాంగ సుందరంగా రూపు దాల్చబోతోంది. రాజమండ్రి నుండి విదేశాలకు వెళ్ళే ప్రయాణికులు, వర్తక వ్యాపారులకు విమాన ప్రయాణం ఇక సులభం కానుంది.

Show comments