Railway Strike: ఇండియన్ రైల్వేలో మరో సమ్మె తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. అర్ధశతాబ్దం క్రితం రైల్వేలో సమ్మె నగారా దేశాన్ని అట్టుడికించింది. మళ్లీ ఇన్నాళ్లకు సమ్మె దిశగా కార్మిక సంఘాలు అడుగులు వేస్తున్నట్టు వారి ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి.. విజయవాడ కేంద్రంగా పలు ధర్నాలు, నిరసనలకు సిద్ధం అవుతున్నాయి కార్మిక సంఘాలు… దేశ వ్యాప్తంగా రైల్వేకు ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉన్న విజయవాడలో స్తంభింపజేస్తే.. యాజమాన్యం దిగివస్తుందన్న ఆలోచనలో రైల్వే యూనియన్లు ఉన్నాయి.. ఆల్ ఇండియా రైల్వే మెన్ నేత శివగోపాల్ మిశ్రా ఆధ్వర్యంలో జాతీయ స్ధాయిలో నిరసనలు చేపట్టబోతున్నారు. 1974 నాటి ఉద్యమ విధానాలు, అప్పటి పరిస్ధితులపై కార్మికులకు అవగాహన కల్పిస్తున్నారు.. ఓపీఎస్ ను సాధించే వరకూ రైల్వే యూనియన్ల పూర్తి కార్యాచరణకు దిగనున్నారు..
దేశంలోనే రైల్వే సంపాదనకు కీలకమైన విజయవాడ కేంద్రంగా ధర్నాలకు, సమ్మెలకు యూనియన్లు సిద్ధం అవుతున్నాయి.. తదుపరి పార్లమెంటు సెషన్ల సమయంలో ఛలో పార్లమెంటు పేరిట పార్లమెంటు ముట్టడికి రైల్వే యూనియన్లు సమాయుత్తం అవుతున్నాయి.. కొత్త పెన్షన్ విధానంతో కార్మికుల నడ్డి విరిచారంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.. పెట్టుబడుల కోసం తమ సేవిగ్స్ తమకు ఇవ్వకుండా ఉండేలా కొత్త పెన్షన్ విధానం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.. ప్రైవేటు కంపెనీలలో రైల్వే పెట్టిన పెట్టుబడులు తగ్గిపోతాయనే కొత్త పెన్షన్ విధానం అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు.. మొత్తంగా పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ కోసం కేంద్రస్థాయిలో రైల్వే కార్మిక సంఘాలు సమ్మె దిశగా కార్యాచరణకు దిగుతున్నాయి. నూతన పెన్షన్ విధానం (ఎన్‌పీఎస్)కు వ్యతిరేకంగా పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు కోసం ఆలిండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎఫ్) కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇప్పటికే తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఆలిండి యా రైల్వే మెన్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎఫ్), విజయవాడ డివిజన్ పరిధిలో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ (ఎస్‌సీఆర్‌ఎంయూ)లు కార్మికులకు నాటి సమ్మెను వివరిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రైల్వేలో మరోసారి సమ్మె సైరన్ మోగనుందా? లేదా రైల్వేశాఖ కార్మికుల డిమాండ్లకు దిగివస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
