Site icon NTV Telugu

Shashi Tharoor: పుతిన్ విందుకు రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం లేదు.. శశి థరూర్‌కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్..

Shashi Tharoor

Shashi Tharoor

Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ విందుకు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ఆహ్వానించలేదు. కానీ.. కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్‌ను ఈ విందుకు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని మన్నించి ఆయన సైతం ఈ విందుకు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ ఎంపీ హాజరైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాష్ట్రపతి భవన్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో థరూర్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను విందుకు ఆహ్వానించక పోవడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పుతిన్ విందుకు థరూర్ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ప్రశ్నించారు. ఆహ్వానం అందడం.. థరూర్ హాజరుకావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి ఉంటుందని ఎద్దేశా చేశారు. మన నాయకుడిని ఆహ్వానించనప్పుడు.. మీరు ఎలా వెళతారని ప్రశ్నించారు.

READ MORE: Ind vs SA: మూడో వన్డేలో కెప్టెన్ రాహుల్ ఏమైనా మార్పులు చేస్తాడా?

ఇదిలా ఉండగా.. ఒక రోజు క్రితం కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇతర దేశాల నుంచి ఎవరైనా ప్రముఖులు వస్తే ప్రతిపక్ష నాయకుడిని కలవడం ఆచారంగా వస్తోందన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల కాలంలో ఇది జరిగిందని గుర్తు చేశారు. కానీ విదేశీ అతిథులు మన దేశానికి వచ్చినప్పుడు.. లేదా నేను విదేశాలకు వెళ్ళినప్పుడు నన్ను కలవొద్దని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సలహా ఇస్తుందని ఆరోపించారు. మరోవైపు.. రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు నిరాధారమైనవిగా తోసిపుచ్చాయి. రాహుల్ గాంధీ జూన్ 9, 2024న లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారని, అప్పటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాతో సహా ఇప్పటివరకు నలుగురు దేశాధినేతలను కలిశారని ప్రభుత్వం పేర్కొంది.

READ MORE: Astrology: డిసెంబర్‌ 6, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్‌న్యూస్..!

Exit mobile version