Site icon NTV Telugu

Rahul Gandhi US Tour: తొలగిన అడ్డంకులు.. అమెరికా పర్యటనకు రాహుల్‌ గాంధీ..

Rahul Gandhi Us Tour

Rahul Gandhi Us Tour

Rahul Gandhi US Tour: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్ష్యులు రాహుల్‌ గాంధీ అమెరికాలో పర్యటించనున్నారు. సోమవారం నుంచి జూన్‌ 4 వరకు అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రాహుల్‌ గాంధీ ఆదివారం కొత్త సాధారణ పాస్‌పోర్టును అందుకున్నారు. పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన అనంతరం రాహుల్‌ ఇటీవల తన దౌత్యహోదా పాస్‌పోర్ట్‌ను అధికారులకు ఇచ్చేశారు. తరువాత కొత్త పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాహుల్‌కు సాధారణ పాస్‌పోర్టు జారీ చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని శనివారం ఢిల్లీ కోర్టు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేసింది. కోర్టు తీర్పు అనంతరం అధికారులు రాహుల్‌ గాంధీకి ఆదివారం సాధారణ పాస్‌పోర్టును పంపించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ అమెరికా పర్యటనకు మార్గం సుగమం అయింది.

Read Also: CM Stalin in Japan: జపాన్‌ పర్యటనలో సీఎం స్టాలిన్.. బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణం

మొత్తంగా రాహుల్‌ గాంధీ అమెరికా పర్యటనకు అడ్డంకులు తొలగిపోయాయి. సాధారణ పాస్‌పోర్టుతో అమెరికా బయలుదేరుతున్నారాయన. ఈ నెల 31 నుంచి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటిస్తారు రాహుల్‌. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు భారత సంతతి పౌరులతో సమావేశమవుతారు. వాషింగ్టన్‌ డీసీలో చట్టసభ సభ్యులు, మేధావులతో భేటీ కానున్నారు రాహుల్‌. జూన్‌ 4న న్యూయార్క్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జావిట్స్‌ సెంటర్‌లో విభిన్న రంగాలకు చెందిన వారితో ముఖాముఖిలో పాల్గొంటారు. అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాహుల్‌ దౌత్య పాస్‌పోర్టుతో కాకుండా సాధారణ పాస్‌పోర్టుతో అమెరికా వెళ్తున్నారు. మోడీ ఇంటి పేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో రాహుల్‌ గాంధీకి ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. ఫలితంగా తన దౌత్య హోదా పాస్‌పోర్టును అధికారులకు అప్పగించారు రాహుల్‌. అమెరికా పర్యటన కోసం సాధారణ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేశారు. అయితే, రాహుల్‌కు పాస్‌పోర్టు ఇవ్వొద్దంటూ నేషనల్‌ హెరాల్డ్‌ కేసు పిటిషన్‌దారు సుబ్రమణ్యస్వామి అభ్యంతరం లేవనెత్తారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ కోర్టు నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ పొందారు. సాధారణంగా పదేళ్లకు ఇచ్చే పాస్‌పోర్టు కాకుండా మూడేళ్ల వ్యవధితో కూడిన పాస్‌పోర్టు జారీకి కోర్టు అనుమతించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం రాహుల్‌ గాంధీకి కొత్త పాస్‌పోర్టు జారీ చేశారు అధికారులు. ఇక, త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. జూన్‌ 22 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు మోడీ. ఆయన పర్యటనకు కొద్ది రోజుల ముందు రాహుల్‌ గాంధీ అమెరికాలో పర్యటిస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Exit mobile version