Rahul Gandhi Convoy Accident: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ వైపు వెళ్తుండగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆయన కాన్వాయ్ వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రధాన వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీ లక్నోలోని నివాసం నుంచి సుల్తాన్పూర్ పర్యటనకు బయలుదేరారు. 2018 నాటి ఒక క్రిమినల్ మాననష్ట దావా కేసుకు సంబంధించి సుల్తాన్పూర్ ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో, ఆయన విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేలోని హలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 89.5 కిలోమీటర్ల మైలురాయి వద్దకు కాన్వాయ్ చేరుకోగానే వెనుక భాగంలో వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానికి సంబంధించిన స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడం, వాహనాలకు పెద్దగా నష్టం వాటిల్లకపోవడం ఊరటనిచ్చే అంశం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

