Rahul Dravid Hails Shreyas Iyer Ahead of IND vs NZ 1st Semi-Final: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన భారత్.. సునాయాసంగా సెమీస్‌కు దూసుకుపోయింది. నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఫెవరేట్ అయినా.. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో కివీస్ చేతిలోనే భారత్ ఓటమి కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. అయితే అద్భుత ఫామ్ కనబర్చుతున్న టీమిండియా.. ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. సెమీస్ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
నెదర్లాండ్స్‌తో చివరి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. సెమీస్‌లో తీవ్ర ఒత్తిడి ఉంటుందని, ఈ విషయాన్ని అంగీకరించడానికి తనకేం ఇబ్బంది లేదన్నాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగే సెమీస్ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ విషయాన్ని అంగీకరించడానికి నాకేం ఇబ్బంది లేదు. అసలు ఒత్తిడే లేదని చెప్పను. ఎందుకంటే.. క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. చివరి వరకూ ఎవరు విజయం సాధిస్తారని చెప్పలేము. మైదానంలో ప్రణాళికలను అమలు చేస్తే.. మ్యాచ్‌పై పట్టు సాధించొచ్చు. వరుసగా మ్యాచ్‌లు గెలిచినప్పుడు అంతా బాగుంటుంది. ఒక్క ఓటమి ఎదురైతే.. ప్రతి ఒక్కరూ నిందిస్తారు. ఆటలో ఇదంతా సహజమే’ అని ది వాల్ చెప్పాడు.
Also Read: Vivo X100 Pro Launch: లాంచ్‌కు ముందే వివో ఎక్స్100 ప్రో ఇమేజ్‌లు.. భారీ కెమెరా ఐలండ్!
‘నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలు చేయడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా సెమీస్ ముందు అయ్యర్ ఫామ్‌ను అందుకోవడం సంతోషం. నాలుగో స్థానంలో ఆడే సరైన ఆటగాడి కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఆ అన్వేషణకు చెక్ పడిందనే చెప్పాలి. అయ్యర్ రూపంలో మంచి బ్యాటర్ దొరికాడు. ఈ ప్రపంచకప్‌లో వరుసగా 9 మ్యాచుల్లోనూ విజయం సాధించాం. తొలి మ్యాచ్ నుంచి ఇప్పటివరకు అదే ఉత్సాహంతో ఆడాం. సెమీస్ మ్యాచ్‌లో ఇలాగె ఆడుతాం’ అని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.