Ragi Side Effects: రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ధాన్యాలలో ఒకటి.. రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటంతో చాలామంది రోజువారీ ఆహారంలో రాగి జావ, రాగి సంగటి (సంకటి), రాగి మాల్ట్ వంటి పదార్థాలను తీసుకుంటుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు, మధుమేహం ఉన్నవారు రాగులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు.. ఇప్పుడు రాగులతో రకరకాల వంటకాలు తయారు చేస్తున్నారు.. రాగి దోశ, రాగి ఇడ్లీ, రాగి వడ, రాగి లస్సీ.. ఇలా ఎన్నో రకాల వంకటాలను రాగులతో ట్రై చేస్తున్నారు.. అయితే ఏ ఆహారమైనా మితంగా తీసుకోవడం అవసరం. రాగులను అధికంగా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు జాగ్రత్త
రాగుల్లో ఆక్సలేట్లు అధికంగా ఉంటాయి.. కాబట్టి, ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతాయి. ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నవారు లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు రాగులను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది కాదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు..
జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం
రాగుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల అవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఎక్కువగా రాగులు తింటే కూడా అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు అంటున్నారు..
థైరాయిడ్ ఉన్నవారికి ప్రభావం
రాగుల్లో గోయిట్రోజెన్లు అనే పదార్థాలు ఉంటాయి. ఇవి హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారిలో థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు.. అందువల్ల థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే రాగులను తీసుకోవడం మంచిది అంటున్నారు..
కొందరికి అలెర్జీలు కూడా
కొంతమందికి రాగులు సరిపోకపోవచ్చు. అలాంటి వారిలో దురదలు, చర్మంపై దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ లక్షణాలు కనిపించవచ్చు. అలాంటి సమస్యలు ఉంటే వెంటనే రాగుల వినియోగాన్ని ఆపి వైద్యులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు..
కానీ, రాగులను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మితంగా తీసుకుంటే రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రాగి జావ లేదా రాగి సంగటిని పరిమిత మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మీకు ఇప్పటికే ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య ఉంటే, రాగులను ఆహారంలో చేర్చే ముందు వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం ఎంతో మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
