Rafael Nadal withdrawal from Australian Open 2024: స్పెయిన్ బుల్, దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ రాఫెల్ నాదల్.. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా తాను ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు 37 ఏళ్ల నాదల్ ఆదివారం ప్రకటించాడు. చికిత్స, విశ్రాంతి కోసం స్పెయిన్‌కు వెళ్లానున్నాడు. ఇక నాదల్ తప్పుకోవడంతో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌కు టైటిల్ గెలిచే అవకాశాలు మెరుగయ్యాయి. అయితే కార్లోస్ అల్కరాజ్, డేనియల్ మెద్వెదేవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మరియు జానిక్ సిన్నర్‌లను జాకో ఎదుర్కోవాల్సి ఉంటుంది.
‘బ్రిస్బేన్‌లో ఆడిన మ్యాచ్‌లో కండరాల్లో నొప్పి వచ్చింది. మెల్‌బోర్న్ వచ్చాక స్కాన్ తీయించుకుంటే.. చీలిక ఉన్నట్లు తెలిసింది. ఇదివరకు గాయమైన భాగంలో ఇది కానందుకు సంతోషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో ఆడేందుకు సిద్ధంగా లేను. చికిత్స కోసం స్పెయిన్‌కు వెళ్తున్నా. పునరాగమనం కోసం గతేడాది ఎంతో కష్టపడ్డా. కానీ మళ్లీ గాయం అయింది. మెల్‌బోర్న్‌లో ఆడలేకపోవటం నిరాశ కలిగించేదే. త్వరలోనే కోర్టులోకి వస్తా’ అని రాఫెల్ నాదల్ తెలిపాడు.
Also Read: Janhvi Kapoor Dating: అందుకే సినిమా వాళ్లతో ఎప్పటికీ డేటింగ్ చేయను: జాన్వీ కపూర్
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 రెండో రౌండ్లో ఓటమి తర్వాత తుంటి గాయం, శస్త్రచికిత్స కారణంగా రాఫెల్ నాదల్ గతేడాది కోర్టులోకి రాలేదు. ఇటీవల జరిగిన బ్రిస్బేన్ టోర్నీతో పునరాగమనం చేశాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాడు జోర్డాన్ థాంప్సన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఆ మ్యాచ్ సందర్భంగా ఎడమ కాలి కండరాల గాయానికి గురయ్యాడు. దాంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024కు దూరమవుతున్నట్లు వెల్లడించాడు. నాదల్ కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన విషయం తెలిసిందే.