Kesineni Nani: జగన్‌ను, వైసీపీని ఎప్పుడూ వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని పేర్కొన్నారు. పాలసీ పరంగానే విమర్శలు చేశానన్నారు. విజయవాడ అభివృద్ధి నా అజెండా అని ఆయన పేర్కొన్నారు. జగన్ ఆర్థిక నేరస్థుడని చంద్రబాబే మాకు నూరిపోశారని కేశినేని నాని తెలిపారు. పార్టీ లైన్‌లోనే గతంలో సీఎం జగన్‌పై విమర్శలు చేశానన్నారు. 2014 -19 మధ్య చంద్రబాబు పాలనలో అనేక తప్పులు జరిగాయన్నారు. జగన్‌ను విమర్శించే ముందు చంద్రబాబు.. ఆయన చేసిన తప్పులు కూడా చూసుకోవాలన్నారు. ఈగోతో టీడీపీ నుంచి బయటకు రాలేదన్నారు. ఈగో ఉంటే వ్యాపారాన్ని మూయించినప్పుడు బయటకు వచ్చేవాడినన్నారు. చంద్రబాబు లోకేష్ నన్ను చాలా అవమానించారన్నారు. గత పదేళ్లుగా ఆవేదన ఉందని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోలేదన్నారు.
Read Also: Question Hour With Kesineni Nani LIVE : క్వశ్చన్ అవర్ విత్ కేశినేని నాని
చంద్రబాబుతో ఉన్నంతవరకు ఆయన బాగుండాలనే కోరుకున్నానన్నారు. జైలుకు వెళ్లినప్పుడు ఎమోషనల్ అయ్యానని.. అందుకే పూజలు చేయించానని తెలిపారు. కేశినేని ట్రావెల్స్ మూసివేతకు కారణం లోకేషే అంటూ కేశినేని నాని చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎన్నో జరిగాయి.. అవన్నీ చెప్పలేనన్నారు. టికెట్లు ఇప్పిస్తానని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదన్నారు. తాను చెప్పిన వాళ్లలో ఒక్కరికి కూడా చంద్రబాబు పదవులు ఇవ్వలేదని కేశినేని నాని వెల్లడించారు. టికెట్ ఇస్తానని ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నానో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఎవరినో విమర్శించమని జగన్ తనకు చెప్పలేదన్నారు. నాకు నష్టం జరిగింది కాబట్టి విమర్శిస్తున్నానని చెప్పారు. బూతులు ఎవరు ఎక్కువ తిడితే టీడీపీలో వారికే పదవులు అని ఆయన విమర్శించారు. టీడీపీ నుంచి బయటకు వచ్చా బాగా తిట్టించారని.. నా కూతురు శ్వేతపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడించారన్నారు. వైసీపీకి ఏ విషయాలు చేరవేశానో చెప్పమనండని ఆయన అడిగారు. కేశినేని ట్రావెల్స్‌ను అర్ధాంతరంగా మార్చడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడ్డానన్నారు. ఆస్తులు అమ్మి అప్పులు కట్టానన్నారు. ఎవరి దగ్గరా అప్పు తీసుకుని ఎగ్గొట్టలేదన్నారు. విజయవాడ అభివృద్ధి జరగాలంటే తానే ఎంపీ కావాలన్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే నా కూతురిని మేయర్‌గా నిలబెట్టానన్నారు.