Putin Flight: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రోజు(డిసెంబర్ 4)న భారత పర్యటనకు వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రోటోకాల్ పట్టించుకోకుండా, నేరుగా పాలం ఎయిర్ బేస్కు వెళ్లి పుతిన్ను ఘనంగా స్వాగతించారు. అక్కడ నుంచి ఇద్దరూ కూడా ప్రధాని నివాసానికి వెళ్లారు. పుతిన్ భారత పర్యటనపై ప్రపంచ దేశాలు చాలా ఆసక్తి కనబరుస్తున్నాయి. మరోవైపు, ఇండియా-రష్యాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.
Read Also: ACB : మరో అవినీతి తిమింగలం.. ఆదాయానికి మించి రూ.100 కోట్లు
అయితే, ఈ రోజు పుతిన్ మాస్కో నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆయన విమానాన్ని చాలా మంది ట్రాక్ చేసినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ FlightRadar24 వెల్లడించింది. ప్రపంచంలోనే ఎక్కువగా ట్రాక్ అయిన విమానంగా ఈ రోజు నిలిచింది. భారత్ వస్తు్న్న పుతిన్ విమానం ఎక్కడ ఉందా.? అని చాలా మంది పరిశీలించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని FlightRadar24 తన ఎక్స్ ఖాతాలో తెలిపింది. ‘‘ప్రస్తుతం మా ప్లాట్ఫాం మీద అత్యధికంగా ట్రాక్ అవుతున్న ఫ్లైట్: భారత్కు వస్తున్న రష్యా ప్రభుత్వ విమానం. రష్యా అధ్యక్షుడు పుతిన్ మరియు భారత ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో రెండు రోజుల పాటు భేటీ కానున్నారు.’’ అని ట్వీట్ చేశారు.
రష్యా అధ్యక్ష విమానం పేరు ఇల్యుషిన్ IL-96-300PU, దీనిని ప్లయింగ్ క్రెమ్లిన్ అని కూడా పిలుస్తారు. దీనిని 1980లో ఇల్యుషిన్ డిజైన్ బ్యూరో అభివృద్ధి చేసింది. నాలుగు ఇంజన్లు కలిగిన ఈ విమానం 1990లలో సర్వీస్ లోకి వచ్చింది.