Vladimir Putin: ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. మాస్కో-కీవ్‌ల మధ్య శాంతి స్థాపనకు అగ్రరాజ్యం సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించింది. కానీ అటుగా చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం కాలేదని సమాచారం. తాజాగా మరోసారి రష్యా అధ్యక్షుడు వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. రష్యా రాజధాని మాస్కోలోని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం వెలుపల వేలాది మంది ప్రజలు బారులు తీరారు. వాళ్లందరూ ఎందుకు అక్కడ బారులు తీరారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Minister Anitha: మత్స్యకారులతో రాజకీయాలు చేయొద్దు..
మాస్కోలో బారులు తీరిన ప్రజలు..
సామాజిక, పర్యావరణ సమస్యల నుంచి తమ ఫిర్యాదులను సమర్పించడానికి సుమారుగా వెయ్యి మందికి పైగా ప్రజలు బారులు తీరారు. రెండేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను బహిరంగంగా లిఖితపూర్వకంగా సమర్పించడానికి రష్యాలో గుమిగూడడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో రష్యాలో పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాని తర్వాత ఇప్పుడు చాలా అరుదుగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సైన్యంపై విమర్శలను నిషేధించే కఠినమైన చట్టాల కారణంగా చాలా కాలంగా దేశంలో ఎలాంటి నిరసనలు బయటికి రాలేదు. యుద్ధ సమయంలో చేసిన నిరసనల కారణంగా చాలా మంది ప్రజలు జైలు పాలయ్యారు, కొందరు ఏకంగా దేశం విడిచి పారిపోయారు. అయితే తాజాగా జరిగింది నిరసన కాదు.. ప్రజల అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి చట్టబద్ధమైన మార్గమని చెబుతున్నారు. అందుకే వీళ్లను నిలుపుదల చేయడం సైన్యానికి అసాధ్యమైందని పేర్కొంటున్నారు.
ప్రతిపక్షాలు కూడా భాగం అయ్యాయి..
రష్యా రాజధాని మాస్కోలోని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయానికి అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకురాలు యులియా గాల్యామినా, మాజీ అధ్యక్ష అభ్యర్థి బోరిస్ నదేజ్దిన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. తమది నిరసన కాదని, తమ హక్కుల సాధన అని వారు చెప్పారు. తమ నగరం కోసం మాట్లాడాలనే ప్రజల కోపాన్ని, కోరికను ఎవరూ అణచివేయలేరని గాల్యామినా అన్నారు. అధ్యక్షుడి కార్యాలయం వద్ద పగటిపూట ప్రజల లైన్ పొడవు 70 నుంచి 115 మీటర్లకు పెరిగిందని సమాచారం. ప్రజల పొడవైన క్యూలను తగ్గించడానికి కార్యాలయ సిబ్బంది త్వరత్వరగా ఫిర్యాదులు స్వీకరించారు. పౌరుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులలో పచ్చదనాన్ని కాపాడటం, పాత, ముఖ్యమైన భవనాలను రక్షించడం, టోల్ రోడ్లను వ్యతిరేకించడం, ఇళ్లను కూల్చివేయడం, ప్రభుత్వ పథకాలను తగ్గించడం వంటి వాటిపై ఉన్నాయి. ఇందులో కొన్ని సమూహాలు అందజేసిన ఫిర్యాదుల్లో వాళ్లు వందల పేజీల సంతకాలను కూడా సేకరించాయి.
పుతిన్ కోటకు బీటలు వాలాయా..
గత రెండేళ్లలో రష్యాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత 2022 ఫిబ్రవరి 24, మార్చి 13 మధ్య కనీసం 14,906 మందిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే యుద్ధ వ్యతిరేక వైఖరి కారణంగా 20 వేల మందికి పైగా జైలు పాలయ్యారు. అయితే అప్పటి నుంచి దేశంలో నిరసనలు బాగా తగ్గాయి. 2023లో ప్రజా నిరసనలకు సంబంధించి 274 మంది అరెస్టులు మాత్రమే జరిగాయి. 2024లో ఈ సంఖ్య కేవలం 41కి తగ్గింది. తాజాగా జరిగింది నిరసనగా పరిగణించక పోయినా ఇది కూడా ఒక రకమైన నిరసననే అని విపక్షాలు చెబుతున్నాయి. ఇప్పటికే పుతిన్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆయన రాజరికపు కోటకు బీటలు వాలాయాని విపక్ష సభ్యులు చెబుతున్నారు.
READ ALSO: Pakistan Gifts Turkiye: తుర్కియేకి పాక్ గిఫ్ట్.. వెయ్యి ఎకరాల భూమి ఉచితం..
