Private Colleges Bandh: రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు నేటి (సోమవారం) నుంచి సమ్మె బాట పట్టనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ సహా అన్ని వృత్తి విద్య కాలేజీలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,840 కాలేజీలు బంద్ కానుండగా.. దాదాపు 35 లక్షలకు పైగా విద్యార్థులపై సమ్మె ప్రభావం చూపనుంది.
గత నాలుగేళ్లుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని గత రెండు నెలలుగా ప్రభుత్వాన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య కోరుతోంది. యాజమాన్య సంఘాల సమాఖ్య తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వానికి మొత్తం 9 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. గతంలో జరిగిన చర్చల్లో దీపావళిలోగా రూ.1,200 కోట్లు విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అయితే ఇందులో ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మిగతా రూ.900 కోట్లు వెంటనే విడుదల చేయాలని పలుమార్లు కోరినా సానుకూల స్పందన లేకపోవడంతో సమ్మె నోటీసు ఇచ్చారు.
అయితే సమ్మె విరమించాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు విజ్ఞప్తి చేస్తూ.. అదనంగా రూ.150 కోట్లు విడుదల చేస్తామని చెప్పినా యాజమాన్యాలు అంగీకరించలేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిలు విడుదల చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నామని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు నిమ్మగడ్డ రమేష్‌బాబు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు కొనసాగినా బకాయిలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఎన్‌టీయూ పరిధిలోని ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్ వార్షిక పరీక్షలతో పాటు బీఈడీ, డీఈడీ పరీక్షలు వాయిదా పడినట్టు అధికారులు ప్రకటించారు.
Koti Deepotsavam 2025 Day 2: కన్నుల పండుగగా.. ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం
అలాగే అనేక కాలేజీల్లో జరుగుతున్న ఇంజనీరింగ్ ఇంటర్నల్ పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, ప్రైవేట్ ఉన్నత విద్యా కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు నిర్వహించాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. బకాయిల చెల్లింపు ఆలస్యం, విజిలెన్స్ విచారణ కారణంగా రాష్ట్ర ఉన్నత విద్యారంగంలో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది.
