క్రికెటర్ ప్రిథ్వి షా , నటి ఆకృతి అగర్వాల్ తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న కొన్ని వారాలకే మళ్లీ కలవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గత మార్చి 8న ఘనంగా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, సెప్టెంబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆ సమయంలో ఆకృతి వెల్లడించారు. అయితే.. కొద్ది రోజుల వ్యవధిలోనే వారిద్దరూ తమ మనసు మార్చుకుని మళ్లీ ఒక్కటయ్యారు.
ఇతరుల ప్రభావంతోనే నిర్ణయం..
ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఎ పర్సనల్ క్లారిఫికేషన్’ పేరుతో ఆకృతి ఒక నోట్ షేర్ చేశారు. తాము విడిపోవడానికి ఇతరుల ప్రభావమే కారణమని ఆమె స్పష్టం చేశారు. తమ బంధం గురించి సరిగ్గా తెలియని కొందరు వ్యక్తుల మాటలు విని, తమ సంబంధాన్ని తప్పుగా అంచనా వేసి తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల కలిగిన బాధకు తాను బాధ్యత వహిస్తున్నానని తెలిపారు.
తాము ఇద్దరం కూర్చుని బహిరంగంగా మాట్లాడుకున్నామని.. ఒకరినొకరం అర్థం చేసుకున్నామని ఆకృతి తెలిపారు. తమకు ఒకరికొకరు సరిపోతామని, ఇకపై ఎవరి జోక్యమూ అవసరం లేదని భావించి మళ్లీ కలిసికట్టుగా ప్రయాణం ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
కొత్త ఆరంభానికి మద్దతు..
ప్రిథ్వి షా కూడా ఇదే పోస్ట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ లవ్ సింబల్స్ జోడించారు. ఇకపై తమ భవిష్యత్తు ఇతరుల మాటల ప్రకారం కాకుండా.. కేవలం తమ సొంత అవగాహన, నమ్మకం, ప్రేమతోనే సాగుతుందని స్పష్టం చేశారు. ఈ కొత్త ఆరంభాన్ని అందరూ గౌరవించాలని వారు కోరారు.

