Prince William and Kate Play Gully Cricket with Sachin Tendulkar: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ భారత్ పర్యటనకు వచ్చారు. 3 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ముంబైకి చేరుకున్న ఈ రాజదంపతులు.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా స్థానిక చిన్నారులతో సరదాగా గడిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రిన్స్ విలియం, కేట్‌తో పాటు సచిన్ టెండూల్కర్, భారత మాజీ మహిళా క్రికెటర్ పూనమ్ రౌత్ పాల్గొన్నారు. ‘ది రైట్ పిచ్’ అనే సంస్థ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రికెట్ ద్వారా యువతలో ఆత్మవిశ్వాసం పెంచడం, వారికి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రిన్స్ విలియం బౌలింగ్ చేయగా.. కేట్ బ్యాటింగ్ చేశారు. స్థానిక పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొందరు రాజదంపతులతో కలిసి క్రికెట్ ఆడగా.. మరికొందరు పక్కన ఉండి ఆటను ఆస్వాదించారు.
ప్రిన్స్ విలియం, కేట్ 2016లో భారత్‌లో పర్యటించినప్పుడు కూడా ముంబైలోని ఓవల్ మైదానంలో స్థానిక చిన్నారులతో క్రికెట్ ఆడారు. అప్పట్లోనూ సచిన్ టెండూల్కర్ వారితో కలిసి పాల్గొన్నారు. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరోసారి సచిన్‌తో కలిసి క్రికెట్ ఆడటంతో ఈ కార్యక్రమం ప్రత్యేకంగా నిలిచింది. క్రికెట్ ఆడిన తర్వాత రాజదంపతులు సచిన్‌తో కలిసి సంప్రదాయ మట్టి కప్పుల్లో అందించే కుల్హడ్ చాయ్‌ను ఆస్వాదించారు.
ప్రిన్స్ విలియం స్థాపించిన ‘ఎర్త్‌షాట్ ప్రైజ్’ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ జంట భారత్‌కు వచ్చింది. నవంబర్ 17న జరగనున్న ఈ వేడుకలో పర్యావరణ పరిరక్షణకు వినూత్న పరిష్కారాలు చూపిన ఐదు ప్రాజెక్టులకు ఒక్కొక్కటి మిలియన్ పౌండ్ల చొప్పున బహుమతి అందించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ఈ వేడుకకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. అలియా భట్, సోనమ్ కపూర్, రామీ మాలెక్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు. గాయని శ్రేయా ఘోషల్, బ్రిటిష్ పాప్ బ్యాండ్ టేక్ దట్ సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రాజదంపతులు ఈ పర్యటనలో భాగంగా ముంబై మెట్రో ప్రయాణం, భారతీయ సినిమా, ఫ్యాషన్, పర్యావరణ ఆవిష్కరణలకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ రాజదంపతులు పాల్గొంటారు. నవంబర్ 18న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన తదుపరి వారి పర్యటన ముగియనుంది.
So it begins… the Prince and Princess of Wales joined Sachin Tendulkar in Mumbai for a game of street cricket on their first engagement in India https://t.co/zTQEKUBPgR
— Kate Mansey (@KateMansey) November 16, 2026

