Site icon NTV Telugu

Pratyusha Suicide Case: సినీ నటి ప్రత్యూష సూసైడ్ కేసులో కీలక పరిణామం..

Pratyusha Suicide Case

Pratyusha Suicide Case

Pratyusha Suicide Case: సినీ నటి ప్రత్యూష కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి.. నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని దేవి దాఖలు చేసిన క్రిమినల్ అపీళ్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా.. ఐదేళ్లలో 11 సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రత్యూష. వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. 2002 ఫిబ్రవరిలో ప్రత్యూష చనిపోవడం అందరినీ కలచివేసింది. ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరు విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోగా చికిత్స అనంతరం సిద్ధార్థ రెడ్డి డిస్చార్జ్ అయ్యాడు. అయితే కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు.

READ MORE: GHMC Notices: అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌లకు షాక్.. నోటీసులు జారీ చేసిన బల్దియా..!

అయితే.. కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సీబీఐ.. నిందితుడిపై 306 ఆత్మహత్యకు పురిగొలపడం, 309 ఆత్మహత్యకు ప్రయత్నించడం సెక్షన్ల కింద చార్ట్ షీట్ దాఖలు చేసింది. దాంతో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 5000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. ఈ కేసులో సిద్ధార్థ హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానాను రూ.50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు విలువరించింది. దీంతో సిద్ధార్థ రెడ్డి ప్రత్యూష తల్లి సరోజిని దేవి 2012 లో సుప్రీం కోర్టులో అపీల్ దాఖలు చేశారు. కొన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ కేసు ఎట్టకేలకు నిన్న విచారణకు వచ్చింది. నిందితుల శిక్షను పెంచాలని ప్రత్యూష తల్లి సరోజిని దేవి పిటిషన్ వేస్తే హైకోర్టు తీర్పును సవాల్ చేశాడు సిద్ధార్థ రెడ్డి.. జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

 

 

Exit mobile version