NTV Telugu Site icon

Artisans Strike: నేటి నుంచి ఆర్టిజన్స్ నిరవధిక సమ్మె

Artisans

Artisans

Artisans Strike: వేతన సవరణతో దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ఆర్టిజన్లకు ప్రాతినిథ్యం వహించే తెలంగాణ విద్యుత్తు ఎంప్లాయీస్‌ యూనియన్‌ (హెచ్‌-82)తో పాటు ఇత్తెహాద్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెకు రెండు సంఘాలు మద్దతు తెలుపుతుండగా.. కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ సంఘాల ప్రతినిధులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే విద్యుత్తు సంస్థల్లో సమ్మెలను నిషేధిస్తూ ఎస్మా-1971 ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది. సమ్మెలో పాల్గొనే, సమ్మెకు ప్రేరేపించే వారిని సీఆర్‌పీసీ-1973లోని సెక్షన్‌-107ను అనుసరించి బైండోవర్‌ చేయాలని యాజమాన్యం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది. విద్యుత్తు సంస్థల్లో రెగ్యులర్‌ ఉద్యోగుల కన్నా ఆర్టిజన్ల సంఖ్యే ఎక్కువగా ఉండడం గమనార్హం. దక్షిణ డిస్కమ్‌(ఎస్పీడీసీఎల్‌)లో 10,200 మంది దాకా ఉండగా… ఉత్తర డిస్కమ్‌(ఎన్పీడీసీఎల్‌)లో 4,270 మంది, ట్రాన్స్‌కోలో 4,405 మంది, జెన్‌కోలో 3,650 మంది కలిపి దాదాపు 22,525 మంది దాకా ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. విద్యుత్తు సంస్థల్లో పనిచేసేవారిలో 60 శాతానికి పైగా వీరే ఉన్నారు.

రెగ్యులర్‌ ఉద్యోగుల కన్నా ఎక్కువగా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేసే తమకు వేతన సవరణలో న్యాయం జరగలేదనేది ఆర్టిజన్లవాదన. రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లకు 7 శాతం వేతనాలు సవరించడంతో వీరిలోని నాలుగు కేటగిరీల వారికి రూ.1250 నుంచి రూ.3 వేల లోపే వేతనాలు పెరిగాయని, రెగ్యులర్‌ ఉద్యోగులు ఒకొక్కరికీ దాదాపు రూ.50 వేల దాకా జీతాలు పెరిగాయని వీరు వాదిస్తున్నారు. దాంతో సమ్మె తప్ప మరో మార్గం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎవరెవరూ సమ్మెలోకి వెళ్లనున్నారనే సమాచారం ఇప్పటికే విద్యుత్తు సంస్థలు తీసుకున్నాయి.

వీరి సమాచారం మేరకు 80 శాతానికి పైగా సమ్మెలోకి వెళ్లనున్నట్లు లిఖితపూర్వకంగా ప్రకటించగా మిగిలిన వారు కూడా అదే దారిలో నడవనున్నారని తెలుస్తోంది. సమ్మె చేసేవారిని అదేరోజు గుర్తించి.. విధుల్లో నుంచి తొలగించి, రిపోర్టు చేయాలని యాజమాన్యాలు ఆదేశించాయి. సమ్మెకు దూరంగా ఉన్న ఉద్యోగులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు కోరాయి. రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్లు ఒకే రకమైన పనులు చేసినప్పు డు ఒకే రకమైన రూల్స్ ఉండాలని.. కానీ యాజమాన్యం 2020లో ఇండస్ట్రియల్ యాక్ట్-1947 ప్రకారం స్టాండింగ్ ఆర్డర్స్ ఇవ్వడం వల్ల వేతనాల్లో వ్యత్యాసం వచ్చిందని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్‌ యూనియన్ ప్రధాన కార్యదర్శి
సాయిలు మండిపడ్డారు. ఓ అం డ్‌ ఎం ఉద్యోగస్తులకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్‌ అమలు చేయడం వల్ల ఆర్టిజన్లకు చాలా అన్యాయం జరిగిందన్నారు.

Read Also: BRS Party: నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు

ఆర్టిజన్ల సమ్మె నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రేటర్‌జోన్‌లో 2 వేలకు పైగా, రంగారెడ్డి, మేడ్చల్‌ జోన్లలో 3వేలకు పైగా ఆర్టిజన్లు పనిచేస్తున్నారు. గ్రేటర్‌జోన్‌లోని డివిజన్లు, సబ్‌డివిజన్‌ స్థాయిలో నోడల్‌ అధికారులను నియమించారు. ఓఅండ్‌ఎం సిబ్బందిని 33/11 కేవీ సబ్‌స్టేషన్లు,ఫ్యూజ్‌ఆఫ్‌ కాల్‌ ఆఫీసుల్లో నియమించడం, అవసరమైనప్పుడు స్కిల్డ్‌ కార్మికులను నియమించుకునే అధికారాలను నోడల్‌ ఆఫీసర్లకు ఇచ్చారు. ప్రతి విద్యుత్తు సబ్‌స్టేషన్‌ వద్ద పోలీస్‌, విజిలెన్స్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎవరైనా విద్యుత్తు సామాగ్రి ధ్వంసం చేసినా, విద్యుత్తు సరఫరా నిలిపివేయడం, విధులకు ఆటంకం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌ సంస్థల్లో సమ్మెలపై నిషేధం ఉందని, ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొంటే ఆర్టిజన్ల సర్వీసు నిబంధన-34(20) ప్రకారం కఠిన చర్యలు తప్పవని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు హెచ్చరరించారు. విద్యుత్తు సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆర్టిజన్లకు వేతన సవరణ చేయడం జరిగిందని, అయినప్పటికీ సరిపోలేదన్న సాకుతో సమ్మెకు పిలుపునిచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, అత్యవసర సర్వీసుల చట్టం(ఎస్మా) అమలులో ఉన్నందున ఈ సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.ఆర్టిజన్ల సమ్మెకు పోవొద్దని, సమ్మెకు వెళితే ఉపేక్షించబోమని, ఆర్టిజన్లు సమ్మెలో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి స్పష్టం చేశారు. ఆర్టిజన్ల సర్వీసు నిబంధనలతో పాటు ఎస్మా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.