Site icon NTV Telugu

Killer whales: జపాన్ లో రికార్డు స్థాయిలో హిమపాతం.. చిక్కుకుపోయిన కిల్లర్ వేల్స్..

Japan

Japan

Japan: జపాన్‌లో ఇటీవల రికార్డు స్థాయి హిమపాతం మొదలు కావడంతో అరుదైన కిల్లర్‌ వేల్స్‌ (Arkas)కు ప్రాణాల మీదకు వచ్చింది. ఉత్తర జపాన్‌లోని హక్కైడో తీరంలో గల రౌస్‌ అనే ప్రదేశానికి కిలో మీటరు దూరంలో గడ్డకట్టిన నీటి మధ్య చిన్న ఖాళీ ప్రాంతంలో దాదాపు 10 కిల్లర్‌ వేల్స్‌ చిక్కుకున్నాయి. ఇవి కదలడానికి జాగా లేకపోవడంతో.. తలలను నీటి బయటపెట్టి శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలను జపాన్‌ జాతీయ టెలివిజన్‌ ఛానెల్‌ ప్రసారం చేసింది. ఆ మూగజీవాలు గాలి ఆడకపోవడంతో నానా అవస్థ పడుతున్న తీరు చూసి జంతుప్రేమికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. కిల్లర్‌ వేల్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏటా రౌస్‌ దగ్గరకు పెద్ద ఎత్తున పర్యటకులు వెళ్తుంటారు.

Read Also: Dunki : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘డంకీ’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

అయితే, ఈ దృశ్యాలను చూసిన కొందరు మత్స్యకారులు అధికారులను అలర్ట్ చేశారు. ఆర్కాస్‌ను రక్షించేందుకు అక్కడకు చేరుకోవడం కోస్టుగార్డ్‌ సిబ్బందికి తీవ్ర ఇబ్బందిగా మారింది. అక్కడి నీరు మొత్తం గడ్డ కట్టిపోయింది. మంచు కరిగిపోయే వరకు తాము ఏమీ చేయలేమని అధికారులు తెలిపారు. అలాగే, 2005లో కూడా ఇలానే మంచులో ఆర్కాస్‌ చిక్కుకుపోయి ప్రాణాలను కోల్పోయాయి. ఆ ఘటన కూడా రౌస్‌ సమీపంలోనే జరిగింది. ఉత్తరార్ధ గోళంలో లోతట్టు ప్రాంతంగా హక్కైడోను పేర్కొంటారు. గతంలో ఇక్కడ భారీగా మంచు గడ్డకట్టి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.

Exit mobile version