NTV Telugu Site icon

Union Budget 2023: ఉపాధి హామీ పథకానికి కోత..ఇళ్లు కొనేవారికి గుడ్‌న్యూస్

Nrega1

Nrega1

గ్రామీణాభివృద్ధి శాఖ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (MGNREGS) కేంద్ర బడ్జెట్‌లో కోత పడింది. రూరల్ డెవలప్‌మెంట్‌కు ఈసారి రూ.1,57,545 కోట్లను కేటాయించారు. క్రితం బడ్జెట్‌తో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రకారం.. MGNREGS పథకానికి రూ.60,000 కోట్లు కేటాయించారు. క్రితం బడ్జెట్‌లో దీనికి రూ.73,000 కోట్లు అలాట్‌ చేశారు. కానీ, సవరించిన అంచనాల ప్రకారం ఈ ఏడాది ఈ పథకానికి రూ.89,400 కోట్లు ఖర్చయ్యాయి. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ప్రకారం.. MGNREGS కింద ఉపాధి కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య కొవిడ్‌ పూర్వ స్థాయికి చేరుకుంది. మహమ్మారి సంక్షోభం నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయికి చేరుకుందనడానికి ఇదే నిదర్శమని సర్వే పేర్కొంది. మరోవైపు ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనకు క్రితం బడ్జెట్‌ తరహాలోనే రూ. 19,000 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అలాగే నేషనల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌- అజీవికాకు కేటాయింపులను స్వల్పంగా పెంచి రూ.14,129.17 కోట్లకు చేర్చింది. పీఎం ఆవాస్‌ యోజనకు రూ.54,487 కోట్లు, శ్రామప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌కు రూ. 550 కోట్లు కేటాయించారు.

కొత్త ఇళ్లు కొనేవారికి గుడ్‌న్యూస్

ఇకపోతే, కొత్తగా ఇళ్లు కొనాలనుకునేవారికి మాత్రం కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకానికి తాజా బడ్జెట్‌లో నిధుల వాటాను భారీగా పెంచింది. గత బడ్జెట్‌లో రూ.48వేల కోట్లు కేటాయించగా, ఇప్పుడు ఏకంగా ఆ నిధులను 66శాతం పెంచారు. తాజా బడ్జెట్‌లో రూ.79వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. వడ్డీ రేట్లు పెరిగిన వేళ గృహ కొనుగోలుదారులకు ఇది ఊరట కల్పించే అంశం. కాగా, మానవ వ్యర్థాలు, డ్రైనేజీల్లోని చెత్తను తొలగించేందుకు ప్రతి నగరం, పట్టణంలో మెషీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పీఎంఏవై పథకానికి భారీగా నిధులు కేటాయించడం ద్వారా రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకింగ్‌ రంగాలతో బలోపేతానికి అవకాశం ఏర్పడింది. ప్రత్యక్షంగా నిర్మాణరంగ కార్మికులకు, పరోక్షంగా అనేక వ్యాపారులకు ఉపాధి కల్పించినట్లైంది. ప్రభుత్వ ప్రకటనపై నిర్మాణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Union Budget 2023: క్లుప్తంగా కేంద్ర బడ్జెట్..అంకెల్లో ఇలా!

Show comments