NTV Telugu Site icon

mulayam singh yadav: ములాయంకు ప్రధాని మోడీ సహా ప్రముఖుల సంతాపం

Mulayam Is No More

Mulayam Is No More

mulayam singh yadav: సుదీర్ఘ పార్లమెంటేరియన్‌, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి దేశంలోని ప్రముఖులు సంతాపం వ్యక్తి చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పల రంగాల్లోని ప్రముఖులు ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ములాయం సింగ్ యాదవ్‌తో ఉన్న అనుబంధాన్ని ట్విట్టర్‌ వేదికగా గుర్తుచేసుకున్నారు.

ములాయం ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ప్రధాని మోడీ కొనియాడారు. ప్రజల సమస్యల పట్ల సున్నితంగా ఉండే నిరాడంబరమైన నాయకుడిగా విస్తృతంగా ప్రశంసించబడ్డారు. శ్రద్ధతో ఆయన ప్రజలకు ఎన్నో ఏళ్లు సేవలదించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్‌, డాక్టర్ లోహియా ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ములాయం తన జీవితాన్ని అంకితం చేశారు అని మోదీ ట్వీట్‌ చేశారు. “ఉత్తరప్రదేశ్, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యంలో కీలక సైనికుడిగా పనిచేశారు. రక్షణ మంత్రిగా, బలమైన భారతదేశం కోసం పనిచేశారు. వేర్వేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయం నుంచే ములాయం సింగ్‌ను ఎన్నోసార్లు కలిశాను. ఆయన అభిప్రాయాలను వినడానికి నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. ఆయన మరణం బాధించింది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షల మంది కార్యకర్తలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా..” ఓం శాంతి అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.

ములాయం సింగ్ యాదవ్ మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ములాయం సింగ్ యాదవ్ సాధించిన విజయాలు అసాధారణమైనవన్నారు. భూమి పుత్రుడైన ములాయం అనుభవజ్ఞుడైన నాయకుడని ప్రశంసించారు. ఆయనను అన్ని పార్టీల నేతలు గౌరవించారని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు, పీసీసీ చీఫ్‌లు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ములాయం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ యాదవ్ రాజకీయాల్లోకి వచ్చారని సీఎం అన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన ములాయం తన జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసమే పని చేశారని సీఎం గుర్తు చేసుకున్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేతాజీగా అందరి చేత పిలువబడ్డారని ఆయన గుర్తు చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులకు సీఎం జగన్ సానుభూతి వ్యక్తం చేశారు.

భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంపై మంత్రి కేటిఆర్‌ ట్విటర్‌లో స్పందించారు. కుమారుడు అఖిలేష్‌ యాదవ్‌కు, ఆయన కుటుంబసభ్యులకు. ట్విటర్​ ద్వారా సంతాపం తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని సంతాపం తెలిపారు.

ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం, దేశ రాజకీయాలలో గొప్ప మార్పు తీసుకొచ్చిందన్నారు. రాజకీయ సంస్కరణలో ఆయన చేసిన సేవలను దేశం ఎన్నటికీ మరువదన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ములాయం మరణం బడుగు బలహీనర్గాలకు తీరని లోటన్నారు.