NTV Telugu Site icon

INS Vikrant: భారత అమ్ములపొదిలోకి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్.. నేడు జాతికి అంకితం

Ins Vikrant

Ins Vikrant

INS Vikrant: రక్షణ రంగంలో భారత శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటే రానే వచ్చింది. ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న నౌకలన్నీ విదేశాలను నుంచి దిగుమతి చేసుకున్నవే కాగా.. ఇప్పుడు అగ్రదేశాలే ఆశ్చర్యపోయేలా అత్యాధునిక విమానవాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ నిర్మించింది. ఐఎన్‌ఎస్ విక్రాంత్.. విజయానికి, శౌర్యానికి గుర్తు. బ్రిటన్‌ నుంచి 1961లో కొనుగోలు చేసిన తొలి విమాన వాహక నౌక ఎన్నో యుద్ధాల్లో కీలకపాత్ర పోషించింది. మరపురాని విజయాలు అందించింది. 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌకకు కూడా అదే పేరు పెట్టారు. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి ఉదయం 9:30 గంటలకు విమాన వాహక నౌకను ప్రారంభించనున్నారు.

ఇండియన్ నేవీ ఇన్-హౌస్ వార్‌షిప్ డిజైన్ బ్యూరో (WDB)చే రూపొందించబడింది. ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ షిప్‌యార్డ్ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ చేత నిర్మించబడింది, విక్రాంత్ అత్యాధునిక ఆటోమేషన్ ఫీచర్‌లతో నిర్మించబడింది. భారతదేశ సముద్ర చరిత్రలో ఇప్పటివరకు నిర్మించిన అతిపెద్ద నౌక. 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భారతదేశపు మొట్టమొదటి విమాన వాహక నౌక పేరు మీద స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ పేరు పెట్టబడింది. ఇది పెద్ద మొత్తంలో స్వదేశీ పరికరాలు, యంత్రాలను కలిగి ఉంది.

262 మీటర్ల పొడవు, 62 వెడల్పును కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక, గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడుతో సముద్రంలో దూసుకెళ్లనుంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు. 45వేల టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, క్షిపణులను లక్ష్యంగా చేసుకోవచ్చు. యుద్ధ సమయాల్లో విమానాలు అలా గాల్లోకి ఎగిరి, శత్రువు పని పట్టేసి ఇలా తిరిగి వచ్చేసేలా ఈ యుద్ధ నౌకలో ఏర్పాట్లు ఉన్నాయి.ఇది దాని ముందున్న దాని కంటే చాలా పెద్దది, మరింత అధునాతనమైనది. విక్రాంత్‌ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. క్యారియర్‌ మెషినరీ ఆపరేషన్లు, షిప్‌ నేవిగేషన్, ఆటోమేటిక్‌ సర్వైబిలిటీ సిస్టం ఏర్పాటు చేశారు. మేజర్‌ మాడ్యులర్‌ ఓటీ, ఎమర్జెన్సీ మాడ్యులర్‌ ఓటీ, ఎల్‌ఎం 2500 గ్యాస్‌ టర్బైన్లు 4, ప్రధాన గేర్‌బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్‌ ప్రొపైల్లర్‌ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ సిస్టమ్, స్టీరింగ్‌ గేర్, ఎయిర్‌ కండిషనింగ్‌ ప్లాంట్లు, కంప్రెసర్లు, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్‌ పంప్స్, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు, అగ్నిమాపక వ్యవస్థ తదితరాలున్నాయి. టేకాఫ్‌ సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు అదనపు లిఫ్ట్‌ ఇచ్చే ఫ్లైట్‌ డెక్‌ స్కీ జంప్‌తో స్టోబార్‌ కాన్ఫిగరేషన్‌ ఏర్పాటు చేశారు. దాంతో అతి తక్కువ సమయంలో టేకాఫ్‌ వీలవుతుంది. ఏ భాగమైనా మొరాయించినా ఆ ప్రభావం మిగతా భాగాలపై పడదు. దాంతో ప్రయాణం నిరాటంకంగా సాగుతుంది.

ఐఎన్​ఎస్​ విక్రాంత్‌ యుద్ధనౌకలో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలో భారీ ఏర్పాట్లు చేశారు. 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు. అలాగే రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌మెషీన్ ఉన్నాయి. ఇక్కడ ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు. విక్రాంత్‌ లోపల దాదాపు 2,300 కంపార్ట్‌మెంట్లను నిర్మించారు. లోపల ఉన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. సముద్రంపై ఉండే విభిన్న వాతావరణ పరిస్థితులకు నౌకలోని సిబ్బంది గురికాకుండా ఉండేందుకు ఎయిర్‌ కండీషనింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని వల్ల అధిక వేడిమి, చలి తెలియదు. ఇక దీని కిచెన్‌ కూడా అత్యాధునికమే. గంటలో ఏకంగా 1,000 మందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసే ఆధునిక పరికరాలున్నాయి.

ఐఎన్​ఎస్​ విక్రాంత్ తయారీ 2005లో కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో ప్రారంభమైంది. స్వదేశీకరణకు మరింత ఊతం ఇచ్చేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్‌ఇండియా లిమిటెడ్‌ఈ నౌక తయారీకి అవసరమైన ఉక్కు అందించేందుకు సిద్ధమైంది. విక్రాంత్ రూపకల్పనలో స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు బీహెచ్​ఈఎల్​ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్‌అండ్‌టీ లాంటి ప్రైవేటు సంస్థలు సహా వంద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పరికరాలను తయారు చేసి ఇచ్చాయి. దీని తయారీ కోసం సెయిల్‌ ఉద్యోగులు 2వేల మంది పని చేయగా, మరో 13వేల మంది బయట శ్రమించారు. హైదరాబాద్‌ సహా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యుద్ధ నౌక పరికరాలు తయారయ్యాయి. 76శాతం భారతీయ సాంకేతికతనే దీని తయారీకి వినియోగించారు. విక్రాంత్‌ తయారీకి మొత్తం 20వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది.

రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడనుంది. ఏ దేశానికైనా యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగలం. ఈ నౌక మిగ్-29కే ఫైటర్ జెట్‌లు, కమోవ్-31, ఎంహెచ్-60ఆర్ మల్టీ-రోల్ హెలికాప్టర్‌లతో కూడిన 30 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడిన ఎయిర్‌వింగ్‌ను ఆపరేట్ చేయగలదు. అదనంగా దేశీయంగా తయారు చేయబడిన అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు (ALH), లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ వచ్చు.

Show comments