Site icon NTV Telugu

PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు.. 72 గంటల పాటు ‘ఓం’ జపం

Pm Modi

Pm Modi

PM Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సోమనాథుడికి అభిషేకం చేసి దేశ శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన ప్రధాని, సోమనాథ్ ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని ఆస్వాదించారు. దీనికి ముందు నిర్వహించిన శౌర్య యాత్రలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ యాత్రలో సోమనాథ్ ఆలయ చరిత్ర, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ విశిష్టత, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పే విధంగా అలంకరించిన శకటాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాని పర్యటనతో సోమనాథ్ ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది. భద్రతను దృష్టిలో ఉంచుకుని భారీగా ఏర్పాట్లు చేయగా, మోడీ పూజలు దేశవ్యాప్తంగా భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపాయి.

READ MORE: Samsung Galaxy S26 Ultra Launch: 200MP కెమెరా, 5400mAh బ్యాటరీ.. భారీ అప్‌గ్రేడ్స్‌తో గెలాక్సీ ఎస్26 అల్ట్రా!

ఇదిలా ఉండగా.. సోమనాథ్ ఆలయానికి సంబంధించిన వెయ్యేళ్ల విశ్వాసం, భారత చరిత్రలోని కీలక ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈ పూజలు నిర్వహించారు. మూడు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మోడీ నిన్న(శనివారం) రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రధానమంత్రికి కేబినెట్ మంత్రి కున్వర్జీ బావళియా, రాజ్‌కోట్ మేయర్ స్వాగతం పలికారు. అనంతరం హెలికాప్టర్‌లో సోమనాథ్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో సోమనాథ్ ఆలయంలో దర్శనం, పూజలు చేయడంతో పాటు ప్రజా కార్యక్రమంలో పాల్గొననున్నారు. అలాగే సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో కూడా పాల్గొంటారు. 1026లో మహ్మద్ ఆఫ్ గజ్నీ సోమనాథ్ ఆలయంపై దాడి చేసిన ఘటనకు వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా ఈ స్వాభిమాన్ పర్వ్ నిర్వహిస్తున్నారు. ఇది ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం, జాతీయ గర్వం, అచంచలమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశం నలుమూలల నుంచి వందలాది సాధువులు సోమనాథ్‌కు చేరుకుని 72 గంటల పాటు నిరంతరంగా ‘ఓం’ జపం చేస్తున్నారు. సాయంత్రం డ్రోన్ షో, మంత్రోచ్ఛారణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండనుంది. 2026 సంవత్సరం సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం తర్వాత 75 ఏళ్లకు గుర్తుగా నిలుస్తోంది. 1951లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో ఆలయాన్ని పునర్నిర్మించి, అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తిరిగి ప్రారంభించారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఇది జాతీయ సంకల్పానికి, సాంస్కృతిక గర్వానికి ప్రతీకగా నిలిచింది. స్వాభిమాన్ పర్వ్‌ను “మన ఆధ్యాత్మిక సంప్రదాయానికి శక్తివంతమైన ప్రతీక”గా మోదీ అభివర్ణించారు.

Exit mobile version