NTV Telugu Site icon

PM Modi: మోడీని కలిసిన సందేశ్‌ఖాలీ బాధిత మహిళలు

Modi

Modi

ప్రధాని మోడీ (PM Modi) పశ్చిమబెంగాల్‌లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. కోల్‌కతాలో అండర్ వాటర్‌లో నిర్మించిన మెట్రో రైలును మోడీ ప్రారంభించారు. దేశంలోనే నీటి అడుగున ప్రయాణించే తొలి రైలుగా చరిత్ర సృష్టించింది. మెట్రో రైలును ప్రారంభించి ప్రధాని అందులో ప్రయాణించారు.

ఇదిలా ఉంటే బెంగాల్‌లో పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని సందేశ్‌ఖాలీ (Sandeshkhali Womens) బాధితులు కలిశారు. ఈ సందర్భంగా తమకు ఎదురైన సమస్యలను ప్రధానికి చెప్పుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన షాజహాన్‌పై భూకబ్జాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సందేశ్‌ఖాలీ మహిళలు ఆరోపించారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని గత కొద్దిరోజులుగా ఆందోళన చేశారు. దీంతో ఆ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుంది. తాజాగా సందేశ్ ఖాలీ బాధిత మహిళలు పలువురు ప్రధాని మోడీని బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. ప్రధాని ఎంతో ఓపికగా వారి ఆవేదనను విని కలత చెందారు. దీంతో బాధిత మహిళలు మరింత భావోద్వేగానికి గురయ్యారు.

బుధవారం పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా సందేశ్‌ఖాలీ లోక్‌సభ నియోజకవర్గంలోని బరాసత్‌కు ప్రధాని వచ్చారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మోడీ సభకు భారీగా మహిళలు తరలి వచ్చారు.

నార్త్ 24 పరగణాలలోని సందేశ్ ఖాలి నియోజకవర్గం ఇటీవల నిరసనలతో అట్టుడికింది. స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్, ఆయన అనుచరులు పలువురు మహిళలపై లైంగిక దాడులు, భూ ఆక్రమణలకు పాల్పడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై బీజేపీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేయగా, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. కోర్టు జోక్యం చేసుకోవడంతో 40 ఏళ్ల షాజహాన్‌ను గతవారంలో బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా కోల్‌కతా హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.