Site icon NTV Telugu

IPL 2025 Final: ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త వేదికలు ప్రకటించిన బీసీసీఐ..!

Ipl 2025

Ipl 2025

IPL 2025 Final: ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మొదట ప్లేఆఫ్స్‌, ఫైనల్ మ్యాచ్‌లు హైదరాబాద్, కోల్‌కతాలో నిర్వహించాలని నిర్ణయించినా.. టోర్నమెంట్‌లో వారం రోజుల విరామం తర్వాత వేదికలను మార్చింది. తాజా ప్రకటన ప్రకారం ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్), అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. బీసీసీఐ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. 70 ఉత్కంఠభరితమైన లీగ్ మ్యాచ్‌ల అనంతరం టాప్-2 జట్ల మధ్య మే 29, గురువారం నాడు న్యూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ముల్లాన్‌పూర్‌లో క్వాలిఫయర్ 1 జరగనుంది. అదే వేదికపై మే 30, శుక్రవారం నాడు ఎలిమినేటర్ మ్యాచ్‌ కూడా జరుగుతుంది.

Read Also: IPL Update: బెంగళూరు టూ లక్నో.. మరో ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు..!

ఇక అంతకంటే ఎక్కువ ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. క్వాలిఫయర్ 2 (క్వాలిఫయర్ 1 ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్ గెలిచిన జట్టు) మ్యాచ్ జూన్ 1న ఆదివారం జరగనుంది. కాగా జూన్ 3, మంగళవారం నాడు ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇది ఐపీఎల్ 18వ సీజన్ విజేతను తేల్చనున్నది. వేదికల మార్పుకు కారణం కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్లేఆఫ్స్ కోసం కొత్త వేదికలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించినట్లు బీసీసీఐ తెలిపింది.

Read Also: HUAWEI nova 14 Series: శాటిలైట్ కమ్యూనికేషన్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో హువావే నోవా 14 సిరీస్ లాంచ్..!

ఇక మరొక మ్యాచ్ వేదిక కూడా మారిన సంగతి బీసీసీఐ వెల్లడించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మే 23న జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ నెం.65ను బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంకి మార్చారు. అలాగే మే 20 నుండి మిగిలిన లీగ్ దశ మ్యాచ్‌లకు కూడా ఆట నియమాల్లో అదనంగా ఒక గంట సమయం కల్పిస్తున్నట్లు బీసీసీఐ తెలియజేసింది. ఈ మార్పులతో ఐపీఎల్ 2025 చివరి దశ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.

Exit mobile version