Site icon NTV Telugu

Piyush Goyal: భారత స్టార్టప్‌ల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించిన కేంద్ర వాణిజ్య మంత్రి

Piyush Goyal

Piyush Goyal

Piyush Goyal: న్యూఢిల్లీ లోని స్టార్టప్ మహాకుంభ్ ఈవెంట్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతీయ స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్‌లైన్ ప్రారంభించారని ఆయన తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా స్టార్టప్ వ్యవస్థాపకులు తమ సమస్యలు, సూచనలు నేరుగా ప్రభుత్వానికి తెలియజేసేందుకు అవకాశం లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌లకు ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుందని గోయల్ హామీ ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్టార్టప్‌లు సులభంగా హెల్ప్‌లైన్‌తో సంభాషించేందుకు, వివిధ భారతీయ భాషల్లో సేవలను అందుబాటులోకి తేవాలని ఆయన చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారులు తమ అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో సహాయపడుతుంది.

Read Also: Heart Attack: కాలేజ్‌లో స్పీచ్ ఇస్తూనే.. గుండెపోటులో మరణించిన 20 ఏళ్ల విద్యార్థిని..

కొంతమంది పెట్టుబడిదారులు తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టి ప్రారంభ దశలో స్టార్టప్‌లలో అధిక వాటాలు తీసుకుంటున్నారని గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వ్యవస్థాపకుడు దాదాపు సగం వాటాను పెట్టుబడిదారులకి విక్రయించాల్సి వచ్చిందని తెలిపారు. సంస్థ విజయవంతమైన తర్వాత వ్యవస్థాపకుడికి తక్కువ ఈక్విటీ మిగలడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలకు పరిష్కారంగా రూ. 10,000 కోట్ల విలువైన రెండవ దశ ఫండ్స్‌ను ప్రారంభిస్తున్నట్టు గోయల్ ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్న స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించబడతాయి. మొదటి విడతగా రూ.2,000 కోట్లను చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI)కి ఈ సంవత్సరంలో విడుదల చేయనున్నామని తెలిపారు. ఇది ప్రారంభ దశ స్టార్టప్‌లకు ఆర్థికంగా సహాయపడుతూ.. వ్యవస్థాపకులు తమ స్వంత యాజమాన్యాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడిన మంత్రి గోయల్.. మన స్వంత AI మోడల్ తయారు చేయాలని, మన మిషన్లు తయారు చేయాలని ఉందని తెలిపారు. ప్రపంచంలో నాణ్యత గల, నైపుణ్యం గల దేశంగా ఎదగాలన్నదే మన లక్ష్యం అని ఆయన అన్నారు. ఇది భారత్‌ను సాంకేతికత, ఆవిష్కరణలో ప్రపంచ నాయకుడిగా మార్చాలన్న ప్రభుత్వ దృక్పథాన్ని తెలుపుతోంది.

Exit mobile version