Site icon NTV Telugu

Piyush Chawla: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో టీమిండియా ప్లేయర్ వీడ్కోలు..!

Piyush Chawla

Piyush Chawla

Piyush Chawla: భారత క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన పియూష్ చావ్లా అన్ని ఫార్మాట్ల నుంచి తన క్రికెట్ కెరీర్‌కు అధికారికంగా ముగింపు పలికాడు. తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ప్రకటనలో పియూష్ చావ్లా తన భావోద్వేగ పోస్టులో.. ఒక అందమైన అధ్యాయానికి కృతజ్ఞతలతో ముగింపు, క్రికెట్‌లోని అన్ని ఫార్మెట్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ అద్భుత ప్రయాణం మొత్తంలో నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.

Read Also: 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

ఇప్పటికే రెండు దశాబ్దాలుగా క్రికెట్ ఆడుతున్న నేను, ఇప్పుడు ఈ అందమైన ఆటకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చేసింది. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజేతల బృందాల్లో భాగం కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. కింగ్స్ లెవన్ పంజాబ్, కొలకతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ జట్లకు నా మీద నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే, తన విజయ ప్రయాణానికి బలమైన కారకుడైన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. నా తండ్రి నన్ను నమ్మి ముందుకు నడిపించారు. ఆయన లేని ఈ ప్రయాణం అసాధ్యమయ్యేది.. ఈరోజు చాలా భావోద్వేగాలతో కూడిన రోజు. క్రికెట్ నుండి వెళ్లిపోతున్నా, ఇది నా హృదయంలో ఎప్పటికీ ఉంటుందని తెలిపారు.

Read Also: Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

పియూష్ చావ్లా తన దశాబ్దాలపాటు సాగిన క్రికెట్ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలోనూ గొప్ప ప్రదర్శన కనబరిచాడు. టెస్ట్ క్రికెట్‌లో ఆయన 2006 నుంచి 2012 మధ్య కాలంలో కేవలం 3 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. ఇందులో అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ 4/69గా నిలిచాయి. వన్డేల్లో 2007 నుంచి 2011 వరకు మొత్తం 25 మ్యాచ్‌లు ఆడిన ఆయన 32 వికెట్లు తీశాడు. అతని బెస్ట్ ఫిగర్స్ 4/23. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా పియూష్ తన సత్తా చాటాడు. 2010–2012 మధ్య 7 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు తీసాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఆయన స్థిరంగా మెరుపులు చూపిస్తూ.. 137 మ్యాచ్‌ల్లో ఏకంగా 446 వికెట్లు తీసి గొప్ప రికార్డు నెలకొల్పాడు.

ఇక ఐపీఎల్‌ గురించి చెప్పాలంటే, ఇది చావ్లా కెరీర్‌లో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది. 2008 నుంచి 2024 వరకు 192 మ్యాచ్‌లు ఆడిన పియూష్, 192 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో మూడవ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇందులో అతని అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్ 4/17గా ఉన్నాయి. పియూష్ చావ్లా తన క్రికెట్ ప్రయాణాన్ని 15 ఏళ్ల వయసులో ప్రారంభించారు. ఇండియా U19, ఉత్తర్ ప్రదేశ్ U22 లాంటి జట్లకు ప్రాతినిధ్యం వహించారు. మొదటి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ను 17 ఏళ్ల వయసులో ఆడారు.

Exit mobile version