Site icon NTV Telugu

RCB vs PBKS: ఆర్సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ ఫైనల్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!

Phil Salt Rcb

Phil Salt Rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఫైనల్ మ్యాచ్ మంగళవారం (జూన్ 3) రాత్రి 7.30కు ఆరంభం కానుంది. మరికొన్ని గంటల్లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ ఫైనల్స్‌లో తలపడనున్నాయి. క్వాలిఫయర్‌-1లో పంజాబ్‌పై అద్భుత విజయంతో నేరుగా ఫైనల్ చేరిన బెంగళూరు.. ఐపీఎల్ ట్రోఫీ కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమైంది. అయితే ఫైనల్‌కు ముందు ఆర్సీబీకి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ బిగ్ మ్యాచ్ విన్నర్, విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడడం లేదని సమాచారం.

ఐపీఎల్ 2025 ఫైనల్‌ కోసం ఆర్సీబీ సోమవారం ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ఫిల్ సాల్ట్ కనిపించలేదని కొన్ని జాతీయ మీడియాలు తమ కథనంలో రాసుకొచ్చాయి. సాల్ట్ ప్రాక్టీస్ సెషన్‌కు ఎందుకు హాజరు కాలేదో ఇంకా తెలియరాలేదదు. అయితే సాల్ట్ సతీమణి మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుందని, ఈ సమయంలో ఆమె చెంత ఉండేందుకు ఇంగ్లాండ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కోచ్ ఆండీ ఫ్లవర్, కెప్టెన్ రజత్ పాటిదార్‌కు విషయం చెప్పి వెళ్ళాడట. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. టాస్ వరకు ఆగాల్సిందే. సాల్ట్ అందుబాటులో లేక‌పోతే.. టిమ్ సీఫర్ట్ తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఫిల్ సాల్ట్ ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో 387 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. క్వాలిఫయర్-1లో సాల్ట్ పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఓ ఆటాడుకున్నా విషయం తెలిసిందే. సాల్ట్ దూరమైతే ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. విరాట్ కోహ్లీ కూడా ఒత్తిడిలో పడే అవకాశాలు లేకపోలేదు. తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న హిట్ట‌ర్ టిమ్ డేవిడ్ సైతం ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా తెలియరాలేదు. ఫైన‌ల్ మ్యాచ్‌కు డేవిడ్ కూడా దూరం కానున్న‌ట్లు స‌మాచారం. ఎస్ఆర్‌హెచ్‌తో జ‌రిగిన లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా డేవిడ్ గాయపడ్డాడు.

 

 

Exit mobile version