Medico Preeti Case: రాష్ట్రంలో సంచలనం రేపిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ప్రీతిది ఆత్మహత్యాయత్నం కాదని, సైఫ్ హత్య చేశాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రీతి గూగుల్‌లో సెర్చ్ చేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని పోలీసులు చెబుతుండగా.. సైఫ్ పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశాడని తండ్రి చెబుతున్నారు. తండ్రి ఆరోపణలతో పోలీసులు కూడా హత్య కోణంలో దర్యాప్తు చేస్తోన్నారు. ప్రీతి ఆత్మహత్యయత్నం ఘటన కేసులో నిందితుడు సైఫ్ నాలుగు రోజుల కస్టడీ ఆదివారంతో ముగుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు సైఫ్ దగ్గర నుంచి పోలీసులు వివరాలు సేకరించి అతడిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి మళ్లీ జైలుకు పంపించమన్నారు. నాలుగు రోజులుగా సైఫ్ నుంచి వివరాలు రాబట్టిన పోలీసులు కీలక అంశాలను నోట్ చేసుకున్నారు. ప్రీతి అస్వస్థతకు గురైన రోజు డ్యూటీలో ఉన్న హెడ్‌నర్స్, స్టాఫ్ నర్స్, మరో జూనియర్ డాక్టర్ స్టేట్‌మెంట్లు ప్రీతి కేసులో కీలకంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్ట్‌తో పాటు టాక్సికాలజీ రిపోర్టును పరిశీలించిన పోలీసులు సైఫ్ స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రీతి కేసులో ఓ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రీతిని ఎవరో హత్య చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నట్లుగా పోలీసులకు ఎక్కడ ఆధారం లభించలేదు. దీంతో హత్యకాదు అనే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రీతిది ఆత్మహత్యా? లేక అనారోగ్య సమస్యతో చనిపోయిందా అనే అంశంపై పోలీసులు ఇంకా నిర్ధారించడం లేదు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడింది. మొదట ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమెను బతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. హైదరాబాద్ నిమ్స్‌లో ప్రీతి ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. వెంటిలేటర్, ఎక్మోపై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఫిబ్రవరి 26న రాత్రి 9.16 గంటలకు ప్రీతి చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడంటూ ప్రీతి ఫిబ్రవరి 18న తల్లిదండ్రులకు చెప్పారు. ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకున్న రోజు రాత్రి విధుల్లో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకు డ్యూటీ చేశారు. అనంతరం ఆత్మహత్యకు యత్నించారు.
Read Also: Man Elope With Son Wife: భర్తకు శఠగోపం.. మామతో కోడలు జంప్
ఆత్మహత్యకు యత్నించే కంటే ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడారు. సైఫ్ తనతో పాటు చాలా మంది జూనియర్లని వేధిస్తున్నాడని తల్లికి చెబుతూ ప్రీతి వాపోయారు. సీనియర్లు అంతా ఒకటేనని చెప్పారు. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తల్లితో మొర పెట్టుకున్నారు. తాను సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి తనను ఏం చేస్తారో అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. కూతురు మృతితో గుండెలవిసేలా రోధించారు. తమ కూతురు పెద్ద ఆశయంతో ఉండేదని, ఆమెతో పాటు ఆ ఆశయం కూడా చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్ ఇచ్చారని, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని కోరారు. ప్రీతి మరణానికి గల కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. కానీ ఇంకా ఎటువంటి నిర్ధారణకు పోలీసులు రాలేకపోతున్నారు.