Site icon NTV Telugu

Tamilnadu: ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. 24 గంటల్లో మూడో ఘటన

Petrol Bomb

Petrol Bomb

Tamilnadu: తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లపై పెట్రోల్‌ బాంబుల దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై సమీపంలోని తాంబరం సమీపంలోని ఆర్‌ఎస్‌ఎస్ నేత ఇంటిపై శనివారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబు విసిరినట్లు పోలీసులు తెలిపారు.ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పెద్దగా ఆస్తి నష్టం జరగలేదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబు విసిరారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గత 24 గంటల్లో ఈ తరహా దాడులు జరగడం ఇది మూడోసారి. ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) పై జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో చెన్నైలో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సమన్వయకర్త సీతారామన్ (62) తన కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. పెద్ద శబ్ధం వినిపించడంతో కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు.తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పెద్ద శబ్ధం విని బయటకు వచ్చి చూడగా మంటలు చెలరేగాయని సీతారామన్‌ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ అని అనుకున్నాం కానీ అది జరగలేదు. మంటలను ఆర్పివేసి పోలీసు అధికారులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న చిట్లపాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీతారామన్ ఇంటి ముందు ద్విచక్ర వాహనంపై వచ్చిన అనుమానితులు ఆగి, పెట్రోల్ నింపిన బాటిల్‌కు నిప్పంటించి ఇంట్లోకి విసిరినట్లు ఫుటేజీలో వెల్లడైంది.సమాచారం అందుకున్న పల్లికరణై డిప్యూటీ కమిషనర్‌ జోస్‌ తంగయ్య సంఘటనా స్థలానికి వచ్చి పెట్రోల్‌ బాంబు పేల్చిన స్థలాన్ని పరిశీలించి ఆరా తీశారు. ఈ ఘటన తాంబరం ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

Ankita Bhandari Case: రిసెప్షనిస్ట్ హత్య..స్థానికుల్లో పెల్లుబికిన ఆగ్రహం, వినోద్‌ ఆర్యపై బీజేపీ సస్పెన్షన్‌ వేటు

కోయంబత్తూరులోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దాడి ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కేరళలోని కన్నూరులో సైతం ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై ఇదే తరహా దాడి జరిగింది. పీఎఫ్ఐ ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబ్ విసిరారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

తమిళనాడులోని కునియముత్తూరు నగరంలోని బీజేపీ కార్యకర్త శరత్ నివాసంపై శుక్రవారం రాత్రి మరో బాటిల్ బాంబు దాడి జరగడంతో ఆవరణలో పార్క్ చేసిన కారు ధ్వంసమైంది. గురువారం తెల్లవారుజామున బీజేపీ కార్యాలయంపై మండే పదార్థం నింపిన సీసా విసిరారు. దీంతో ఆ ప్రాంతంలో భాజపా కార్యకర్తలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version